India A Lost: భారత్‌ ఏ అవమాన పరాజయం

దోహా వెస్ట్ ఎండ్ పార్క్ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్‌లో భారత్ ఏ–బంగ్లాదేశ్ ఏ మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు వెళ్లింది.

Published By: HashtagU Telugu Desk
India A Lost

India A Lost

దోహా (ఖతార్): ఆసియా కప్ రైసింగ్ స్టార్్స్ టోర్నీలో భారత్ ఏ జట్టుకు భారీ అవమానం (Embarrassing Defeat) ఎదురైంది. బంగ్లాదేశ్ ఏ (Bangladesh A) లాంటి సాదాసీదా టీమ్‌తో ఓడి సెమీఫైనల్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఐపీఎల్‌లో భారీ సిక్సులు కొడతారు కానీ అవసరమైనప్పుడు ఒక్కరూ మ్యాచ్ గెలిపించలేరని అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం (Criticism) వ్యక్తం చేస్తున్నారు.

దోహా వెస్ట్ ఎండ్ పార్క్ స్టేడియంలో జరిగిన తొలి సెమీఫైనల్‌లో భారత్ ఏ–బంగ్లాదేశ్ ఏ మ్యాచ్ టై అయ్యి సూపర్ ఓవర్‌కు వెళ్లింది. టాస్ గెలిచిన భారత్ ఏ బౌలింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ ఏ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేసింది. హబీబుర్ రెహమాన్ సోహన్ 65 పరుగులతో మెరవగా, చివర్లో మెహ్రూబ్ 18 బంతుల్లో 48 నాటౌట్‌తో స్కోరు పెంచాడు. భారత బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ 2 వికెట్లు తీసి మెరుగ్గా ఆడాడు.

195 పరుగుల లక్ష్య ఛేజ్‌లో భారత్ ఏ కూడా గట్టిగా పోరాడింది. 20 ఓవర్లలో 6 వికెట్లకు 194 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. నెహాల్ వధేరా 32 నాటౌట్‌తో పోరాడినప్పటికి విజయం మాత్రం రాలేదు.

సూపర్ ఓవర్‌లో భారత్ ఏ ఘోరంగా విఫలమైంది. రిపన్ మొండోల్ వేసిన రెండు యార్కర్లకు జితేష్ శర్మ, అశుతోష్ శర్మ అవుట్ అయ్యారు. భారత్ ఏ ఒక్క పరుగు కూడా చేయలేకపోయింది. 1 పరుగు లక్ష్యంతో బంగ్లాదేశ్ ఏ కేవలం రెండు బంతుల్లో విజయం సాధించింది. సుయాష్ శర్మ వేసిన ఓ వైడ్ బంతితో బంగ్లాదేశ్ మ్యాచ్‌ను గెల్చుకుంది.

సూపర్ ఓవర్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రిపన్ మొండోల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. బంగ్లాదేశ్ ఏ నవంబర్ 23న జరగబోయే ఫైనల్‌కు అర్హత సాధించింది.

  Last Updated: 21 Nov 2025, 09:06 PM IST