Site icon HashtagU Telugu

IND vs WI : రెండో వన్డేకు భారత తుది జట్టు ఇదే

Ind Vs Wi

Ind Vs Wi

అహ్మదాబాద్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో ఘనవిజయం సాధించిన భారత్ ఇప్పుడు సిరీస్ విజయంపై కన్నేసింది. అన్ని విభాగాల్లోనూ పూర్తి ఆధిపత్యం కనబరిచిన రోహిత్ సేన మరోసారి ఫేవరెట్ బరిలోకి దిగుతోంది. ఫుల్ టైమ్ వైట్-బాల్ కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ తొలి మ్యాచ్‌లోనే భార‌త్‌కు అద్భుతమైన విజ‌యాన్ని అందించాడు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు దూరమైన కేఎల్‌ రాహుల్ ఈ మ్యాచ్ తో రీ ఎంట్రీ ఇవ్వనుండగా.., క్వారంటైన్ గడువు ఇంకా ముగియకపోవడంతో శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ , రుతురాజ్ గైక్వాడ్ , నవదీప్ సైనీలు ఈ మ్యాచ్ కు కూడా దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే రెండో వన్డేలో వెస్టిండీస్ ను ఢీకొట్టే టీమిండియా తుది జట్టులో మార్పులు జరగనున్నాయి. ఈ మ్యాచ్ లో భారత ఇన్నింగ్స్ ను మరోసారి రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఆరంబించనుండగా.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో రిషబ్ పంత్ బ్యాటింగ్ కు రానున్నారు… అయితే ఈ మ్యాచ్ కు కేఎల్ రాహుల్ అందుబాటులోకి రావడంతో యువ ఆల్ రౌండర్ దీపక్ హుడా రిజర్వ్ బెంచ్ కే పరిమితం కానున్నాడు.ఆరో స్థానంలో సూర్యకుమారి యాదవ్ బ్యాటింగ్ కు దిగనున్నాడు.

ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా మరోసారి వాషింగ్టన్ సుందర్ , యజువేంద్ర చాహల్ జోడి బరిలోకి దిగనుంది. వీరిద్దరూ తొలి మ్యాచ్ లో విండీస్ బ్యాటర్లకు క్రీజులో కుదురుకోనివ్వలేదు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన చాహల్ అదరగొడితే… సుందర్ కూడా అద్భుతంగా రాణించాడు. ఇదిలా ఉంటే తొలి వన్డేలో తేలిపోయిన శార్దూల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చాహర్ తుది జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇక పేస్ బాధ్యతల్ని మరోసారి ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ మోయనున్నారు.  ఇక అహ్మదాబాద్ పిచ్‌ ను పరిశీలిస్తే పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. కాసేపు క్రీజులో కుదురుకుంటే భారీస్కోర్లు చేయడం పెద్ద కష్టమేమీ కాదని అంచనా. మొత్తం మీద తుది జట్టులో రెండు మార్పులు జరిగే అవకాశమున్న వేళ టీమిండియా సిరీస్ విజయానికి అడుగు దూరంలో ఉంది.

Exit mobile version