IND vs WI: తొలి వన్డేలో రోహిత్ కు జోడీగా ఇషాన్ కిషన్

వెస్టిండీస్‌తో ఆదివారం తొలి వన్డే కోసం భారత ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు.

  • Written By:
  • Updated On - February 5, 2022 / 03:40 PM IST

వెస్టిండీస్‌తో ఆదివారం తొలి వన్డే కోసం భారత ఆటగాళ్లు సిద్ధమవుతున్నారు. రెగ్యులర్ కెప్టెన్‌గా రోహిత్ శర్మకి ఇదే మొదటి సిరీస్ అదే సమయంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో తొలిసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడబోతున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో విండీస్‌తో స్వదేశంలో జరుగనున్న సిరీస్‌ మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. వెస్టిండీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని భావిస్తోంది. ఇక గాయం కారణంగా జట్టుకు దూరమైన రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో వన్డే కెప్టెన్ హోదాలో తొలిసారిగామీడియా ముందుకు వచ్చిన హిట్ మ్యాన్ తమ వ్యూహాలు, ఓపెనింగ్‌ జోడీ వంటి అంశాల గురించి మాట్లాడాడు. దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తాము చాలా నేర్చుకున్నామని, లోపాలను సరిదిద్దుకొని జట్టును పటిష్టం చేసుకున్నామని చెప్పాడు. ఇక కెప్టెన్సీకి సంబంధించి ,కోహ్లీ పైనా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

కోహ్లీ సారథిగా ఉన్నపుడు తాను వైస్‌ కెప్టెన్‌గా పనిచేశాననీ, తమ ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయన్నాడు.. అందర్నీ సమన్వయము చేసుకుంటూ జట్టును ముందుకు తీసుకెళ్తానని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్‌లో యువ క్రికెటర్లకి అవకాశాలివ్వడంపైప్రశ్నించగా.. రోహిత్ శర్మ చమత్కారంగా సమాధానమిచ్చాడు. టాపార్టర్ లో యువ క్రికెటర్లకి సిరీస్‌లో ఎక్కువగా అవకాశాలిస్తారా అని ప్రశ్నించగా ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్లుగా ఆడి.. తాను, శిఖర్ ధావన్ రిజర్వ్ బెంచ్‌పై ఉండాలని మీరు ఆశిస్తున్నారా అంటూ రోహిత్ శర్మ నవ్వుతూ బదులిచ్చాడు… అలాగే మొదటి వన్డేలో తనతో పాటుగా ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని స్పష్టం చేసిన రోహిత్ తుది జట్టు కూర్పుపై మ్యాచ్ కు ముందు నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చాడు.