Site icon HashtagU Telugu

IND vs WI 4th T20: చెలరేగిన జైశ్వాల్ , గిల్… సిరీస్ సమం చేసిన టీమిండియా

India vs West Indies

New Web Story Copy 2023 08 12t233005.452

IND vs WI 4th T20: వెస్టిండీస్ తో జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. సిరీస్ ఆశలు నిలుపుకునే క్రమంలో నాలుగో టీ ట్వంటీలోనూ విండీస్ ను చిత్తు చేసింది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సిరీస్ ను సమం చేసింది. ఆదివారం జరిగే చివరి మ్యాచ్ తోనే సిరీస్ ఫలితం తేలనుంది.

మొదట బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. ఆరంభంలోనే ఓపెనర్లు బ్రాండన్ కింగ్ , కైల్ మేయర్స్ ధాటిగా ఆడే ప్రయత్నంలో వెనుదిరిగారు. షైన్ హోప్ ధాటిగా ఆడుతున్నా… నికోలస్ పూరన్, కెప్టెన్ రోవ్ మన్ పావెల్ విఫలమయ్యారు. అయితే హెట్ మెయిర్ , హోప్ విండీస్ ఇన్నింగ్స్ ను గాడిన పెట్టారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 49 పరుగులు జోడించారు. హోప్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 రన్స్ చేయగా.. తర్వాత హెట్ మెయిర్ మెరుపులు విండీస్ కు మంచి స్కోరును అందించాయి. హెట్ మెయిర్ 39 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేసాడు. దీంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 178 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 , కుల్ దీప్ యాదవ్ 2 , అక్షర్ పటేల్, చాహల్, ముకేశ్ కుమార్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఫ్లోరిడా పిచ్ లో ఛాలెంజింగ్ టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు యశస్వి జైశ్వార్ , శుభ్ మన్ గిల్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి బంతినే బౌండరీ కొట్టిన జైశ్వాల్ తన రెండో మ్యాచ్ లో అదరగొట్టేశాడు. విండీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి పరుగులు సాధించాడు. అటు గిల్ కూడా ధనాధన్ బ్యాటింగ్ తో చెలరేగిపోయాడు. దీంతో భారత్ పవర్ ప్లేలో 66 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లు భారత ఓపెనర్లను కట్టడి చేయలేక తలలు పట్టుకున్నారు. ఈ క్రమంలో జైశ్వాల్ , గిల్ ఇద్దరూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అర్థశతకాల తర్వాత మరింత రెచ్చిపోయిన వీరి జోడీ బౌండరీల వర్షం కురిపించింది. 10 ఓవర్లలోనే భారత్ స్కోర్ వంద దాటగా విండీస్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు.

శుభ్ మన్ గిల్ 47 బంతుల్లో3 ఫోర్లు, 5 సిక్సర్లతో 77 పరుగులు చేసిన గిల్ ఔటవడంతో 165 పరుగుల పార్టనర్ షిప్ కు బ్రేక్ పడింది. అంతర్జాతీయ టీ ట్వంటీల్లో ఏ వికెట్ కైనా భారత్ కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. గతంలో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ 135 పరుగుల పార్టనర్ షిప్ రికార్డును గిల్, జైశ్వాల్ బ్రేక్ చేశారు. కాగా జైశ్వాల్ , తిలక్ వర్మ భారత్ విజయాన్ని పూర్తి చేశారు. టీమిండియా మరో 3 ఓవర్లు మిగిలుండగానే టార్గెట్ ను ఛేదించింది. జైశ్వాల్ 51 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 84 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో ఐదు టీ ట్వంటీల సిరీస్ ను 2-2తో సమం చేసింది. సిరీస్ ఫలితాన్ని తేల్చనున్న చివరి టీ ట్వంటీ ఫ్లోరిడా వేదికగానే ఆదివారం జరుగుతుంది.

Also Read: Asian Champions Trophy: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేత భారత్… ఫైనల్ లో మలేషియాపై విజయం

Exit mobile version