Site icon HashtagU Telugu

West Indies Beat India: తొలి టీ20 వెస్టిండీస్​దే.. 4 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి

West Indies Beat India

Compressjpeg.online 1280x720 Image

West Indies Beat India: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమి (West Indies Beat India) చవిచూడాల్సి వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితం అయింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యం సాధించింది.

భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ను వెస్టిండీస్ జట్టు విజయంతో ప్రారంభించింది. 5 మ్యాచ్‌ల T20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగింది. ఇందులో విండీస్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్ 16వ ఓవర్లో కెప్టెన్ హార్దిక్, సంజూ శాంసన్‌లు పెవిలియన్‌కు చేరడంతో మ్యాచ్ పూర్తిగా తారుమారైంది.

ఈ మ్యాచ్‌లో భారత జట్టు విజయానికి చివరి ఓవర్‌లో 10 పరుగులు చేయాల్సి ఉంది. కానీ కుల్దీప్ యాదవ్ మొదటి బంతికే పెవిలియన్‌కు చేరుకున్నాడు, ఆ తర్వాత చాహల్ 1 పరుగు తీసి అర్ష్‌దీప్ సింగ్‌కి స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతికి 2 పరుగులు రావడంతో చివరి 3 బంతుల్లో భారత్‌కు 7 పరుగులు అవసరం కాగా, నాలుగో బంతికి పరుగులు రాలేదు. 5వ బంతికి అర్ష్‌దీప్ సింగ్ 1 పరుగుతో రనౌట్ అయ్యాడు. చివరి బంతికి భారత్ విజయానికి 6 పరుగులు అవసరం కాగా, చివరి బంతికి 1 పరుగు రావడంతో వెస్టిండీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Also Read: India First T20 Match: టీమిండియా తొలి టీ20 మ్యాచ్ ఆడింది ఎప్పుడో తెలుసా..? ఆ మ్యాచ్ లో గెలిచిందెవరంటే..?

150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (3), ఇషాన్ కిషన్ (6) ఇద్దరూ ఘోరంగా నిరాశ పరిచారు. దీంతో భారత్ 28 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత తిలక్ వర్మ (39), సూర్య కుమార్ యాదవ్ (21) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరు మూడో వికెట్‌కు 39 పరుగులు జోడించారు. వేగంగా ఆడుతున్న తిలక్ వర్మను అవుట్ చేసి రొమారియో షెపర్డ్‌ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.

అప్పటికి జట్టు స్కోరు 11 ఓవర్లలో 77 పరుగులు. దీంతో భారత్ జోరుకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్ బాగా నెమ్మదించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (19), సంజు శాంసన్ (12), అక్షర్ పటేల్ (13) వేగంగా ఆడలేకపోయారు. దీంతో భారత్ విజయానికి నాలుగు పరుగుల దూరంలో ఆగిపోయింది. వెస్టిండీస్ బౌలర్లలో ఒబెడ్ మెకాయ్, జేసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అకియల్ హొస్సేన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.