IND vs WA-XI Highlights: మొదటి వార్మప్ అదిరింది!

టీ ట్వంటీ వరల్డ్ కప్ సన్నాహాలను భారత క్రికెట్ జట్టు ఘనంగా ఆరంభించింది.

Published By: HashtagU Telugu Desk
Team India Practice

Team India Practice

టీ ట్వంటీ వరల్డ్ కప్ సన్నాహాలను భారత క్రికెట్ జట్టు ఘనంగా ఆరంభించింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్ లో టీమిండియా 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్ లో సూర్య కుమార్ యాదవ్, బౌలింగ్ లో అర్ష దీప్ సింగ్ మెరిశారు. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ 158 రన్స్ చేసింది. ఫామ్ లో ఉన్న స్టార్‌ బ్యాటర్‌ సూర్య కుమార్‌ యాదవ్‌ మరో సారి విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. కేవలం 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు. హార్దిక్‌ పాండ్యా 20 బంతుల్లో 29, దినేష్‌ కార్తీక్‌ 19 నాటౌట్‌ రాణించారు.

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కేవలం 3 , పంత్‌ కూడా 17 పరుగులు చేశారు. వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రెండోర్ఫ్, మథ్యూ కెల్లీ చెరో రెండు వికెట్లు, టై ఒక్క వికెట్‌ సాధించారు. కాగా ఈ మ్యాచ్‌ లో విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌కు విశ్రాంతి ఇచ్చారు. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్ట్రన్ ఆస్ట్రేలియాను భారత పేసర్లు ఆరంభం నుంచే దెబ్బ తీశారు. భువనేశ్వర్, అర్ష దీప్ సింగ్ ధాటికి ఆ జట్టు కీలక బ్యాటర్లు క్రీజులో నిలువలేక పోయారు. చివర్లో సామ్ ఫిన్నింగ్స్ మెరుపు హాఫ్ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. చివరికి వెస్ట్రన్ ఆస్ట్రేలియా 145 రన్స్ చేయగలిగింది. భారత బౌలర్లలో అర్ష దీప్ సింగ్ 3 , భువనేశ్వర్ 2 వికెట్లు పడగొట్టారు.

  Last Updated: 10 Oct 2022, 03:04 PM IST