Site icon HashtagU Telugu

IND vs SA: టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ.. దక్షిణాఫ్రికా సిరీస్‌కు కీలక ఆటగాళ్లు దూరం?

IND vs SA

IND vs SA

IND vs SA: భారత క్రికెట్ అభిమానుల దృష్టి ఇప్పుడు రాబోయే దక్షిణాఫ్రికా (IND vs SA) పర్యటనపై ఉంది. నవంబర్ 30 నుండి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. ఈ సిరీస్‌కు సంబంధించిన భారత జట్టు ఎంపిక త్వరలో జరగనుంది. అయితే టీమ్ ఇండియాకు కీలకమైన ఆటగాళ్ల ఫిట్‌నెస్ సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి.

శుభ్‌మన్ గిల్ ఫిట్‌నెస్ అనుమానాలు

ప్రస్తుతం జట్టులో అత్యంత నిలకడగా రాణిస్తున్న యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఫిట్‌నెస్‌పై సందేహాలు నెలకొన్నాయి. గిల్ పూర్తిస్థాయిలో ఫిట్‌గా లేడని తెలుస్తోంది. దీనితో అతను దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో ఆడే అవకాశాలు దాదాపుగా లేవని సమాచారం. గిల్ లేకపోవడం జట్టుకు పెద్ద లోటుగా పరిగణించవచ్చు.

కెప్టెన్సీపై సస్పెన్స్‌.. కొత్త రేసులోకి పంత్

రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వన్డే జట్టుకు నాయకత్వం వహించాల్సి ఉంటుంది. అయితే హార్దిక్ పాండ్యా కూడా ఇప్పటికీ గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదని, అతను ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశం లేదని భావిస్తున్నారు.

Also Read: TEA: రోజుకు ఎన్ని కప్పుల టీ తాగాలి? ఖాళీ కడుపుతో టీ తాగవచ్చా?

ముగ్గురు ముఖ్య ఆటగాళ్లు (రోహిత్ శర్మ, గిల్, పాండ్యా) అందుబాటులో లేకపోతే భారత జట్టుకు స్టాండ్-బై కెప్టెన్ అవసరం పడుతుంది. ఈ నేపథ్యంలో జట్టు మేనేజ్‌మెంట్ సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్ లేదా మెరుపు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రాహుల్, పంత్ ఇద్దరూ జాతీయ జట్టుకు కెప్టెన్సీ చేశారు.

అయ్యర్ స్థానంలో పంత్ రీ-ఎంట్రీ

ఫిట్‌నెస్‌ సమస్యలతో బాధపడుతున్న మరో కీలక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ కూడా దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో ఆడే అవకాశం దాదాపు లేనట్లే. అయ్యర్ గైర్హాజరీలో స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ వన్డే జట్టులోకి తిరిగి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

గాయం నుంచి కోలుకున్న పంత్, అయ్యర్ స్థానంలో కీలకమైన నెం. 4 స్థానంలో బ్యాటింగ్ చేస్తూ కనిపించే అవకాశం ఉంది. పంత్ రాకతో బ్యాటింగ్‌ ఆర్డర్ బలోపేతమవుతుందని, అతన్ని కెప్టెన్సీకి ఎంపిక చేస్తే భవిష్యత్తు కోసం నాయకత్వ ఎంపికల్లో కొత్త కోణం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి జట్టు ప్రకటనకు ముందు కీలక ఆటగాళ్ల ఫిట్‌నెస్, కెప్టెన్సీ ఎంపికపై నెలకొన్న సస్పెన్స్ క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.

Exit mobile version