IND vs SA 2022: టీమిండియా బిజీ బిజీ!

రెండు నెలల పాటు అభిమానులను అలరించిన ఐపీఎల్ 2022 సీజన్ ముగిసింది.

  • Written By:
  • Updated On - June 2, 2022 / 03:17 PM IST

రెండు నెలల పాటు అభిమానులను అలరించిన ఐపీఎల్ 2022 సీజన్ ముగిసింది. ఫ్రాంచైజీ క్రికెట్ ముగియడంతో భారత్ ఆటగాళ్ళు కొన్ని రోజుల బ్రేక్ తో మళ్ళీ వరుస సీరీస్ లతో బిజీగా గడపనున్నారు. ఐపీఎల్ ముగిసినా భారత్ ఇకపై బ్రేకుల్లేకుండా వరుస టీ ట్వంటీ సీరీస్ లు ఆడబోతోంది. మొదట జూన్ 9 నుంచి సౌతాఫ్రికాతో ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కి సిద్ధం కానుంది. ఈ సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టూర్‌కి బయలుదేరి వెళ్లే భారత జట్టు, అక్కడ కౌంటీ టీమ్‌తో కలిసి జూన్ 24 నుంచి నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూలై 1న డర్బీషైర్ టీమ్‌తో ఓ టీ20 వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. అదే రోజు మరో జట్టు ఇంగ్లాండ్‌తో కలిసి ఐదో టెస్టు మ్యాచ్ ఆడుతుంది. జూలై 5న ఈ టెస్టు మ్యాచ్ ముగియనుండగా.. ఈ లోపు మరో జట్టు నార్తాంప్టన్ టీమ్ తో మరో టీ20 మ్యాచ్ ఆడుతుంది.ఇంగ్లాండ్ టూర్ ముగియగానే అక్కడి నుంచి వెస్టిండీస్ టూర్‌కి వెళ్తుంది భారత జట్టు. ఈ టూర్‌లో మూడు వన్డేలు, 5 టీ20 మ్యాచులు ఆడుతుంది. ఆ తర్వాత శ్రీలంక టూర్‌కి వెళ్లి 2 టీ20 మ్యాచులు ఆడనుంది.

ఆగస్టు నెలాఖరును ఆసియా కప్ టీ20 టోర్నీ మొదలుకానుంది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో కలిసి మూడు టీ20 మ్యాచుల సిరీస్ ఆడుతుంది..అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీకి ముందు భారత్ జట్టు దాదాపు 25 నుంచి 30 టీ20 మ్యాచులు ఆడబోతోంది. అయితే టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీకి ముందు ఆటగాళ్లకు తగినంత ప్రిపరేషన్ ఉండేలా షెడ్యూల్ సిద్ధం చేసింది. వీటిలో కేవలం సౌత్ ఆఫ్రికా , ఐర్లాండ్ సీరీస్ లకు మాత్రమే సీనియర్ ప్లేయర్స్ కు విశ్రాంతినిచ్చారు. మిగిలిన అన్ని సీరీస్ లకు టీమ్ మొత్తం అందుబాటులో ఉండేలా బీసీసీఐ ప్లాన్ చేసింది. టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు ఈ వరుస సీరీస్ లు రోహిత్ సేనకు మంచి సన్నద్ధత కలిగిస్తాయని బీసీసీఐ ధీమాగా ఉంది. యూఏఈ వేదికగా జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో నిరాశ పరిచిన భారత్ ఈ సారి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తున్న మెగా టోర్నీలో సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. మొత్తం మీద రాబోయే ఆరు నెలలు టీమ్ ఇండియా తో పాటు క్రికెట్ ఫాన్స్ కు టీ ట్వంటీ ఎంటర్ టైన్ మెంట్ ఖాయమని చెప్పొచ్చు.