Site icon HashtagU Telugu

IND vs PAK Final: ఆసియా కప్ ఫైనల్.. టాస్ గెలిచిన వారికే ట్రోఫీనా?

IND vs PAK Final

IND vs PAK Final

IND vs PAK Final: ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా ఈ రోజు రాత్రి భారత్ వ‌ర్సెస్‌ పాకిస్థాన్ మధ్య టోర్నమెంట్ టైటిల్ పోరు (IND vs PAK Final) జరగనుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమ్ ఇండియా విజయాల రథంపై దూసుకుపోతోంది. భారత జట్టు ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలిచి అద్భుతంగా ఫైనల్‌ టిక్కెట్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు పాకిస్థాన్ వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. దుబాయ్ మైదానంలో ట్రోఫీ ఎవరి సొంతం అవుతుందనేది టాస్ ద్వారా చాలా వరకు నిర్ణయమవుతుంది.

టాస్‌ గెలిచిన జట్టుకే ఛాంపియన్‌షిప్‌!

దుబాయ్ ఇంటర్నేషనల్ మైదానంలో ఈ సీజన్‌లో భారత్ వ‌ర్సెస్‌ పాకిస్థాన్‌లు ఇప్పటికే రెండుసార్లు తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌లలోనూ సూర్యకుమార్ యాద‌వ్‌ అండ్ కో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఈ మైదానంలో భారత్-పాకిస్థాన్‌లు ఇప్పటివరకు మొత్తం 5 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాయి. ఈ అన్ని మ్యాచ్‌లలో చేజింగ్ చేయడాన్ని ఇష్టపడిన జట్టే విజయం సాధించింది. అంటే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్న జట్టే ఈ రైవల్రీలో ఆధిపత్యం చెలాయించింది. ఆసియా కప్ 2025లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ టీమ్ ఇండియా లక్ష్యాన్ని ఛేదిస్తూనే పాకిస్థాన్‌ను ఓడించింది.

Also Read: LPG Connections: ఎల్‌పీజీ పోర్టబిలిటీ.. ఇక గ్యాస్ కంపెనీని కూడా మార్చుకోవచ్చు!

భార‌త్ వ‌ర్సెస్ పాక్‌ హెడ్ టు హెడ్ రికార్డు

ఆసియా కప్ చరిత్రలో భారత్ వ‌ర్సెస్‌ పాకిస్థాన్ ఇప్పటివరకు మొత్తం 21 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమ్ ఇండియా 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పాకిస్థాన్‌కు కేవలం 6 విజయాలు మాత్రమే దక్కాయి. ఈ సీజన్‌లో కూడా ఇరు జట్లు రెండుసార్లు తలపడగా.. రెండుసార్లు సూర్యకుమార్ యాద‌వ్‌ అండ్ కో పాకిస్థాన్ జట్టుపై ఆధిపత్యం కనబరిచింది.

అద్భుత ఫామ్‌లో టీమ్ ఇండియా

ఆసియా కప్ 2025లో టీమ్ ఇండియా అద్భుతమైన ఫామ్‌లో ఉంది. భారత జట్టు టోర్నమెంట్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయ రుచి చూసింది. బ్యాటింగ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ విపరీతంగా చెలరేగిపోయాడు. అభిషేక్ 6 మ్యాచ్‌లలో 204 స్ట్రైక్ రేట్‌తో 309 పరుగులు చేసి, రికార్డు సృష్టించాడు. అభిషేక్‌తో పాటు తిలక్ వర్మ కూడా టోర్నమెంట్‌లో మంచి ఫామ్‌లో కనిపించాడు. బౌలింగ్‌లో కుల్‌దీప్ యాదవ్ మాయాజాలం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ రాత్రి జరిగే ఫైనల్‌లో టీమ్ ఇండియా తమ అద్భుత ప్రదర్శనను కొనసాగించి, 9వ సారి ఆసియా కప్ టైటిల్‌ను గెలుస్తుందేమో చూడాలి.

Exit mobile version