ఆకలితో ఉన్నవాడికి ఫుల్ మీల్స్ దొరికితే ఎలా ఉంటుందో చెప్పాలా…క్రికెట్ ఫాన్స్ కు భారత్, పాక్ ఆసియా కప్ మ్యాచ్ ఇలాంటి ఫీలింగ్ నే ఇచ్చింది. గత కొంతకాలంగా టీమిండియా ఆడుతున్న మ్యాచ్ లు అన్నీ దాదాపు వన్ సైడ్ గానే జరుగుతున్నాయి. దీంతో ఆయా మ్యాచ్ లకు పెద్ద రేటింగ్స్ , వ్యూయర్ షిప్ రాలేదు. అయితే భారత్ , పాక్ పోరు అంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది. ఊహించనట్లుగానే ఆసియా కప్ లో చిరకాల ప్రత్యర్ధుల సమరం ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తూ ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగి టీ ట్వంటీ మజాను అందించింది.దీంతో అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కు రికార్డు స్థాయిలో వ్యూయర్‌షిప్ దక్కింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్ స్టార్ ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది.
డిస్నీ హాట్‌స్టార్‌లో భారత్ పాక్ ఆసియా కప్ మ్యాచ్ ను కోటీ 30 లక్షల మంది వీక్షించారు. ఇప్పటి వరకు హాట్‌స్టార్ హయ్యెస్ట్ వ్యూస్ కోటీ 20 లక్షలు మాత్రమే. గతేడాది టీ ట్వంటీ ప్రపంచకప్‌లో భారత్ , పాకిస్థాన్ మ్యాచ్‌కు, ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ కి ఈ వ్యూస్ వచ్చాయి. తాజాగా ఆ రికార్డులన్నిటీని ఆసియాకప్ మ్యాచ్ అధిగమించింది. హాట్‌స్టార్‌లో ఇన్ని వ్యూస్ వచ్చాయంటే.. టీఆర్‌పీ రేటింగ్స్‌లో స్టార్ స్పోర్ట్స్ రికార్డులు సృష్టించినట్లేననీ అంచనా వేస్తున్నారు. గత టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భారత్ ఓడిపోవడం….ఈసారి మ్యాచ్ పై అంచనాలు రివేంజ్ రూపంలో బాగా పెరిగి పోయాయి. దీనికి తోడు కోహ్లీ చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడం, ఆదివారం కావడం వంటి అంశాలు రికార్డు వ్యూయర్ షిప్ కు కారణంగా తెలుస్తోంది.