IND vs NZ: వడోదరలో లభించిన ఘనవిజయంతో వచ్చిన జోష్ రాజ్‌కోట్‌లో ఆవిరైపోయింది. రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు భారత్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. స్టార్ బ్యాటర్లు విఫలమవ్వగా బౌలర్లు కూడా ధారాళంగా పరుగులు ఇచ్చి నిరాశపరిచారు. దీంతో మూడు వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి వన్డే ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. కివీస్ భారత్ గడ్డపై చరిత్ర సృష్టించకుండా అడ్డుకోవాలంటే టీమ్ ఇండియా మూడో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేయాల్సిందే. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తుది జట్టులో కీలక మార్పులు చేసే అవకాశం ఉంది.
తుది జట్టులో మార్పులు తప్పవా?
ఇండోర్ వన్డే కోసం టీమ్ ఇండియా మేనేజ్మెంట్ ఒక ముఖ్యమైన మార్పు గురించి ఆలోచిస్తోంది. రెండో వన్డేలో అవకాశం దక్కించుకున్న నితీశ్ కుమార్ రెడ్డి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. బ్యాటింగ్‌లో కేవలం 20 పరుగులు మాత్రమే చేసిన నితీశ్ బౌలింగ్‌లోనూ కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసి ప్రభావం చూపలేకపోయారు. దీంతో నితీశ్ స్థానంలో ఆయుష్ బదోనీని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. బదోనీకి ఫినిషర్‌గా మంచి రికార్డు ఉంది. అంతేకాకుండా మధ్య ఓవర్లలో తన స్పిన్ బౌలింగ్‌తో వికెట్లు తీయగల సామర్థ్యం కూడా అతనికి ఉంది.
Also Read: ఇరాన్‌లో 3,428 మంది మృతి.. ట్రంప్ కీలక ప్రకటన!
రెండో వన్డేలో కివీస్ ఆధిపత్యం
రెండో వన్డేలో న్యూజిలాండ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై భారత జట్టును కేవలం 284 పరుగులకే కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు సఫలమయ్యారు. కివీస్ బౌలర్ క్రిస్టియన్ క్లార్క్ అద్భుతమైన బౌలింగ్‌తో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ వంటి దిగ్గజాలను పెవిలియన్ పంపాడు. భారత్ తరఫున కెఎల్ రాహుల్ సెంచరీతో మెరవగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అర్ధ సెంచరీ సాధించారు. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ బ్యాటర్లు డారిల్ మిచెల్, విల్ యంగ్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొని జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు. ఇప్పుడు అందరి కళ్లు ఇండోర్ వేదికగా జరగనున్న ఆఖరి పోరుపైనే ఉన్నాయి. అక్కడ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది.
