Bumrah: బుమ్రా వచ్చేశాడు.. ఐర్లాండ్ తో సీరీస్ కు భారత్ జట్టు ఇదే..!

గాయాలతో దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah) జట్టులోకి వచ్చేశాడు.

  • Written By:
  • Updated On - August 1, 2023 / 08:33 AM IST

Bumrah: ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ కు ముందు భారత క్రికెట్ ఫాన్స్ కు గుడ్ న్యూస్.. గాయాలతో దాదాపు ఏడాది కాలంగా ఆటకు దూరమైన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Bumrah) జట్టులోకి వచ్చేశాడు. ఐర్లాండ్ తో జరిగే సీరీస్ తో అతను రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కేవలం రీ ఎంట్రీ మాత్రమే కాదు ఈ సీరీస్ లో జట్టును కూడా బుమ్రానే లీడ్ చేయబోతున్నాడు.

ఐర్లాండ్‌తో మూడు టీ ట్వంటీల సిరీస్‌ కోసం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ ప్లేయర్స్ కు రెస్ట్ ఇచ్చిన సెలక్టర్లు బుమ్రాను కొత్త కెప్టెన్‌గా నియమించారు. బుమ్రాకు డిప్యూటీగా రుతురాజ్‌ గైక్వాడ్‌ వ్యవహరించనున్నాడు. ఐపీఎల్‌ లో అదరగొట్టిన రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.

అయితే గాయాల నుంచి ఇంకా కోలుకోకపోవడంతో ఓపెనర్ కే ఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న ప్రసిద్ధ్‌ కృష్ణ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున సత్తా చాటిన శివమ్‌ దూబే కూడా చోటు దక్కించుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌ నేపథ్యంలోనీ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రెగ్యులర్‌ టీ ట్వంటీ జట్టు కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యాకు కూడా సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.

Also Read: England Level Series: బ్రాడ్ లాస్ట్ పంచ్.. ఇంగ్లండ్ దే యాషెస్ చివరి టెస్ట్..!

ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్టులో ఉన్న ఆటగాళ్లకు సెలక్టర్లు ప్రాధాన్యత ఇచ్చారు. కాగా, విండీస్‌తో టీ ట్వంటీ సిరీస్‌ ముగిసిన అనంతరం టీమిండియా ఆగస్ట్‌ 18 నుంచి ఐర్లాండ్‌తో 3 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. విండీస్‌తో టీ ట్వంటీ సిరీస్‌కు ఎంపికైన తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, అర్ష్‌దీప్‌ సింగ్, సంజు శాంసన్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ కరేబియన్ దీవుల నుంచే ఐర్లాండ్‌కు వెళ్లనున్నారు.

ఐర్లాండ్ తో టీ ట్వంటీలకు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్‌), రుతురాజ్ గైక్వాడ్ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్‌), జితేష్ శర్మ (వికెట్‌కీపర్‌), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్