IND vs ENG: భారత జట్టు ఇంగ్లండ్ (IND vs ENG) పర్యటనలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడమే కాకుండా వారి ప్రదర్శన నిరంతరం దిగజారిందని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో బ్యాట్, బాల్ రెండింటిలోనూ టీమ్ ఇండియా నిరాశపరిచింది. దీనికి ప్రధాన కారణం జట్టు మేనేజ్‌మెంట్ ఇంగ్లాండ్ వ్యూహాలను అనుకరించడానికి ప్రయత్నించి విఫలమైందని ఆరోపణలు వస్తున్నాయి.
ఇంగ్లాండ్‌ను అనుకరించి దెబ్బతిన్న టీమ్ ఇండియా
సోషల్ మీడియాలో ‘కేప్‌టౌన్ క్రికెట్ క్వీన్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఒక నెటిజన్ భారత జట్టు మేనేజ్‌మెంట్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంగ్లాండ్ జట్టు ఆల్‌రౌండర్లపై ఎక్కువగా ఆధారపడుతుందని, దీన్ని చూసి టీమ్ ఇండియా కూడా తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ముగ్గురు ఆల్‌రౌండర్లకు అవకాశం ఇచ్చిందని ఆమె ఆరోపించారు. అయితే, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వీరిని సమర్థవంతంగా ఉపయోగించుకోలేకపోతున్నాడని ఆమె అన్నారు.
ఆల్‌రౌండర్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ప్రయత్నంలో మ్యాచ్ విన్నర్ కుల్దీప్ యాదవ్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శార్దూల్ ఠాకూర్ రెండు మ్యాచ్‌ల్లో ఆడినప్పటికీ చాలా తక్కువ బౌలింగ్ చేశాడని, అలాగే సుందర్‌కు కూడా సరైన సమయంలో బౌలింగ్ అవకాశం రాలేదని ఆమె పేర్కొన్నారు. ఇది జట్టు సమతుల్యతను దెబ్బతీసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Heavy Rains: భారీ వర్షాలు.. జిల్లాకు రూ. కోటి విడుదల చేసిన తెలంగాణ సర్కార్!
మాంచెస్టర్ టెస్ట్‌లో టీమ్ ఇండియా పేలవ ప్రదర్శన
భారత జట్టు బౌలింగ్ ఇటీవల కాలంలో బలమైనదిగా పేరు గాంచింది. చివరిసారిగా 11 సంవత్సరాల క్రితం న్యూజిలాండ్‌పై ఒక ఇన్నింగ్స్‌లో 600 పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లు ఆ తర్వాత అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అయితే, ప్రస్తుత మాంచెస్టర్ టెస్ట్‌లో ఇంగ్లాండ్‌పై ఏకంగా 669 పరుగులు సమర్పించుకోవడం తీవ్ర నిరాశను కలిగించింది. దీని కారణంగా ఇంగ్లీష్ జట్టు 311 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది.
రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమ్ ఇండియా మొదటి ఓవర్‌లోనే రెండు వికెట్లను కోల్పోయి మరింత కష్టాల్లో పడింది. ప్రస్తుతం మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు చాలా వెనుకబడి కనిపిస్తోంది. ఈ పేలవ ప్రదర్శన జట్టు మేనేజ్‌మెంట్ వ్యూహాలపై మరింత ప్రశ్నలను లేవనెత్తుతోంది.