Site icon HashtagU Telugu

IND vs ENG: నాల్గ‌వ టెస్ట్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌!

IND vs ENG

IND vs ENG

IND vs ENG: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆండర్సన్- టెండూల్క‌ర్ ట్రోఫీలో భారత జట్టుకు (IND vs ENG) గాయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నాల్గవ టెస్ట్ ప్రారంభానికి ముందే పలువురు కీలక ఆటగాళ్లు గాయాల ద్వారా సిరీస్ నుంచి తప్పుకోవడం లేదా దూరం కావడం జరిగింది. ఆదివారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ఆల్‌రౌండర్ నీతీష్ కుమార్ రెడ్డి మోకాలికి గాయం కావడంతో మొత్తం టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. అలాగే, లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా నెట్ ప్రాక్టీస్ సమయంలో ఎడమ చేతి బొటనవేలికి గాయం కావడంతో మాంచెస్టర్ టెస్ట్ నుంచి తప్పుకున్నాడు.

గాయాల వివరాలు & మార్పులు

నీతీష్ కుమార్ రెడ్డి.. ఆదివారం ప్రాక్టీస్ సెషన్‌లో మోకాలికి గాయం కావడంతో మొత్తం టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు. మొదటి టెస్ట్‌లో శార్దూల్ ఠాకూర్ స్థానంలో ఆడిన నీతీష్, రెండవ, మూడవ టెస్ట్‌లలో తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు.

అర్ష్‌దీప్ సింగ్.. బెకెన్‌హామ్‌లో నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా ఎడమ చేతి బొటనవేలికి గాయమైంది. బంతిని ఆపే ప్రయత్నంలో చేతికి గాయ‌మైంద‌ని, దాని లోతును బట్టి అతని పురోగతి ఉంటుందని అసిస్టెంట్ కోచ్ టెన్ డోస్చెట్ తెలిపారు. బీసీసీఐ మెడికల్ టీమ్ అతని పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది.

Also Read: WTC Final: డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్స్‌ను భార‌త్‌లో నిర్వ‌హించ‌క‌పోవ‌డానికి గ‌ల కార‌ణాలీవే!

అంశుల్ కంబోజ్ చేరిక

అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో హ‌ర్యానాకు చెందిన 24 ఏళ్ల పేస్ బౌలర్ అంశుల్ కంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అంశుల్ మాంచెస్టర్‌లో జట్టుతో కలిశాడు. టెస్ట్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో ఇండియా-ఎ తరఫున ఆడిన రెండు మ్యాచ్‌లలో ఐదు వికెట్లు తీశాడు. గత సంవత్సరం రంజీ ట్రోఫీలో కేరళపై ఒక ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసి వార్తల్లో నిలిచాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడవ బౌలర్‌గా అంశుల్ నిలిచాడు. పేస్ బౌలర్ ఆకాశ్ దీప్ కూడా గాయం కారణంగా నాల్గవ టెస్ట్‌లో ఆడలేడని వార్తలు వచ్చాయి.

కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్

ఆదివారం మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్‌బాల్ క్లబ్ ఆటగాళ్లను కలవడానికి వెళ్లిన జట్టులో నీతీష్ రెడ్డితో పాటు కేఎల్ రాహుల్ కూడా పాల్గొనలేదు. అయితే రాహుల్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, అతని ఫిట్‌నెస్ గురించి ఎలాంటి ఆందోళన లేదని బీసీసీఐ ధ్రువీకరించింది. నీతీష్ రెడ్డి గాయపడటంతో జట్టు మేనేజ్‌మెంట్ ఇప్పుడు శార్దూల్ ఠాకూర్ పైన నమ్మకం ఉంచే అవకాశం ఉంది. ఎందుకంటే అతను గతంలో కూడా జట్టుకు కీలక ప్రదర్శనలు అందించాడు.

నాల్గవ టెస్ట్ & సిరీస్ పరిస్థితి

భారత్- ఇంగ్లండ్ మధ్య నాల్గవ టెస్ట్ జులై 23 నుంచి 27 వరకు మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో జరగనుంది. లండన్‌లోని లార్డ్స్ స్టేడియంలో జరిగిన మూడవ టెస్ట్‌లో ఇంగ్లండ్ 22 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యం సాధించింది. భారత్ రెండవ టెస్ట్‌ను గెలిచింది. నాల్గవ టెస్ట్‌ను గెలిచి సిరీస్‌ను 2-2తో సమం చేయాలని టీమ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. రెండు జట్లు ఆదివారం మాంచెస్టర్‌కు చేరుకున్నాయి.