IND vs ENG: దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ క్రీడా శాస్త్రవేత్త ఎడ్రియన్ లే రాక్స్ భారత పురుష క్రికెట్ జట్టుకు (IND vs ENG) కొత్త స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఆయన ఇటీవల ఈ పదవి నుంచి తప్పుకున్న సోహమ్ దేశాయ్ స్థానంలో నియమితులయ్యారు. లే రాక్స్ గతంలో కూడా భారత జట్టుతో పనిచేశారు. ఆయన మొదటి పదవీకాలం 2002 జనవరి నుంచి 2003 మే వరకు ఉంది. అంతేకాకుండా ఆయన ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), పంజాబ్ కింగ్స్ జట్లకు కూడా తన సేవలను అందించారు.
ఎడ్రియన్ లే రాక్స్ భావోద్వేగ సందేశం
ఎడ్రియన్ లే రాక్స్ ఇటీవల ఐపీఎల్ 2025లో రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ జట్టుతో తన ఆరు సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేశారు. ఈ వీడ్కోలు సందర్భంగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. ఈ ఆరు సంవత్సరాల ప్రయాణం నాకు చాలా ప్రత్యేకమైనది. మేము ఫైనల్స్‌కు చేరుకున్నాం. కొంచెం వెనుకబడ్డాం., కానీ జట్టు కృషి, ఉత్సాహంపై నాకు గర్వంగా ఉంది. అందరు ఆటగాళ్లు, సిబ్బంది, సహచరులకు హృదయపూర్వక ధన్యవాదాలు. క్రికెట్ కేవలం ఫలితాల గురించి మాత్రమే కాదు, ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే సంబంధాలు మరియు జ్ఞాపకాల గురించి కూడా పేర్కొన్నాడు.
Also Read: FIR Against RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. కేసు నమోదు!
ఐపీఎల్‌లో లే రాక్స్ సహకారం కూడా చాలా ముఖ్యమైనది. ఆయన 2008 నుంచి 2019 వరకు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో కలిసి పనిచేశారు. ఈ సమయంలో జట్టు 2012- 2014లో టైటిల్స్ గెలుచుకుంది. ఆ తర్వాత ఆయన 2018 నుంచి 2024 వరకు పంజాబ్ కింగ్స్‌తో పనిచేశారు. ఇప్పుడు లే రాక్స్ భారత జట్టుతో తన రెండవ పదవీకాలాన్ని ప్రారంభించనున్నారు. ఆయన కొత్త పదవీకాలం ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ప్రారంభమవుతుంది, ఇది జూన్ 20 నుంచి లీడ్స్‌లో మొదలవుతుంది. ఈ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌లు ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్, ఓల్డ్ ట్రాఫోర్డ్, ఓవల్‌లలో జరుగుతాయి.