Site icon HashtagU Telugu

IND vs ENG 3rd Test: శతక్కొట్టిన రోహిత్, జడేజా.. రాజ్ కోట్ లో తొలిరోజు భారత్ హవా ..!

Teamindia Tour Of England

Teamindia Tour Of England

IND vs ENG 3rd Test భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్ట్ రసవత్తరంగా ఆరంభమైంది. తొలి సెషన్ లో ఇంగ్లాండ్ బౌలర్లు పై చేయి సాధించినా.. తర్వాత రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్ , సర్ఫ్ రాజ్ ఖాన్ మెరుపులు, జడేజా శతకంతో ఓవరాల్ గా మొదటిరోజు భారత్ ఆధిపత్యం కనబరిచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నాలుగు మార్పులు చేసింది. జడేజా, సిరాజ్ జట్టులోకి రాగా… సర్ఫ్ రాజ్ ఖాన్, ధృవ్ జురెల్ అరంగేట్రం చేశారు. ఈ మ్యాచ్ లో భారత్‌కు శుభారంభం లభించలేదు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది.

యువ ప్లేయర్లు పెవిలియన్‌కు చేరడానికి పోటీపడ్డారు. జైశ్వాల్ 10, పటిదార్ 5 , జైశ్వాల్ డకౌటయ్యారు. ఈ దశలో రోహిత్ శర్మ, జడేజా జట్టును ఆదుకున్నారు. చాలా రోజుల తర్వాత హిట్ మ్యాన్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలో శతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్ సెంచరీ చేయడం దాదాపు ఏడాది తర్వాత ఇదే తొలిసారి.

అటు జడేజా కూడా నిలకడగా ఆడడంతో ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. రోహిత్ శర్మ 14 ఫోర్లు,3 సిక్సర్లతో 131 పరుగులు చేసి ఔటవగా.. తర్వాత క్రీజులోకి వచ్చిన సర్ఫ్ రాజ్ ఖాన్ దుమ్మురేపాడు. అరంగేట్రం మ్యాచ్ అన్న టెన్షన్ లేకుండా ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వారి బాజ్ బాల్ కాన్సెప్ట్ తోనే వారికి చుక్కలు చూపించాడు. టీ ట్వంటీ తరహాలో షాట్లు ఆడుతూ 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. సెంచరీ కూడా కొట్టేస్తాడనుకున్న దశలో జడేజా చేసిన తప్పిదానికి సర్ఫ్ రాజ్ తన వికెట్ త్యాగం చేయాల్సి వచ్చింది. ఫలితంగా 62 పరుగులకు ఔటయ్యాడు.

తర్వాత జడేజా తన హోంగ్రౌండ్ లో శతకం పూర్తి చేసుకున్నాడు. సర్ఫ్ రాజ్ ను రనౌట్ చేసానన్న బాధలో జడేజా తన సెంచరీని కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. జడేజా 110 ( 9 ఫోర్లు, 2 సిక్సర్లు) , కుల్దీప్ యాదవ్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు, హార్ట్ లీ 1 వికెట్ పడగొట్టారు.