Site icon HashtagU Telugu

IND vs BAN: బంగ్లాపై మిథాలీసేన భారీవిజయం

Women Cricket

Women Cricket

మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత్ మళ్ళీ గెలుపు బాట పట్టింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల జట్టు 7 వికెట్లకు 229 పరుగులు చేసింది.యస్తికా భాటియా హాఫ్ సెంచరీతో రాణించగా.. మంధాన 30, షెఫాలీ వర్మ 42 పరుగులు చేశారు. నిజానికి భారత్ ఈ స్కోర్ సాధిస్తుందని అనుకోలేదు. మిడిలార్డర్‌లో ఎవరూ రాణించకపోవడంతో తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేలా కనిపించింది. అయితే పూజా వస్త్రాకర్, స్నేహా రాణా ధాటిగా ఆడి స్కోర్ 200 దాటించారు. పూజ 30 , స్నేహ 27 రన్స్ చేయగా… వికెట్ కీపర్ రిఛా ఘోష్‌ 26 పరుగులు చేసింది.

ఛేజింగ్‌లో బంగ్లాను ఆరంభం నుంచే భారత బౌలర్లు కట్టడి చేశారు. వరుస వికెట్లు పడగొడుతూ బంగ్లాను కోలుకోనివ్వలేదు. రాజేశ్వరి గైక్వాడ్ తొలి వికెట్‌ తీసి బ్రేక్ ఇవ్వగా.. తర్వాత స్నేహా రాణా చెలరేగింది. దీంతో బంగ్లాదేశ్ మహిళల జట్టు 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. బంగ్లా బ్యాటర్ సల్మా కాసేపు పోరాడడంతో ఆ జట్టు స్కోర్ 100 దాటగలిగింది. చివరికి బంగ్లాదేశ్ 119 పరుగులకే కుప్పకూలింది. దీంతో మిథాలీ 110 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. భారత బౌలర్లలో స్నేహ రాణా 4 వికెట్లు పడగొట్టింది. భారీ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో మిథాలీసేన మూడో స్థానానికి చేరుకుంది. చివరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాతో తలపడనున్న భారత్ దానిలో గెలిస్తే ఇతర జట్లతో సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. దక్షిణాఫ్రికా 8 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. మార్చి 27న భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో తన చివరి మ్యాచ్‌లో తలపడుతుంది.

Exit mobile version