Site icon HashtagU Telugu

IND vs BAN 2nd Test: కోహ్లీని ఊరిస్తున్న ఆ రెండు రికార్డులు

Kohli Test Records

Kohli Test Records

IND vs BAN 2nd Test: చెన్నై టెస్టులో విరాట్ కోహ్లి భారీ స్కోర్ చేయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగులు మాత్రమే చేసిన కోహ్లి రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో కోహ్లీ ఖాతాలో చేరాల్సిన రెండు రికార్డుల్ని కోల్పోయాడు. అయితే 27 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో కోహ్లి ఈ రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. కాన్పూర్ టెస్టులో విరాట్ కోహ్లీ తన పేరిట రెండు భారీ రికార్డులను సృష్టించేందుకు సిద్దమవుతున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో విరాట్ కోహ్లి (virat kohli) 26,967 పరుగులు చేశాడు. తదుపరి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 33 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 27,000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం కోహ్లీ మొత్తం మూడు ఫార్మాట్లతో కలిపి 593 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అత్యంత వేగంగా 27,000 పరుగులు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 623 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. సచిన్‌తో పాటు రికీ పాంటింగ్, కుమార సంగక్కర 27,000కు పైగా అంతర్జాతీయ పరుగులు సాధించారు. కాన్పూర్ టెస్టు (kanpur test)లో విరాట్ కోహ్లి 129 పరుగులు చేస్తే.. టెస్టు క్రికెట్‌లో 9,000 పరుగులు పూర్తి చేస్తాడు. సచిన్, ద్రవిడ్, గవాస్కర్ తర్వాత టెస్టుల్లో 9,000 పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు. అయితే రికార్డులు సృష్టించడం, ఉన్న రికార్డుల్ని బద్దలు కొట్టడం కింగ్ కు కొత్తేమి కాదు.

రెండో టెస్టులో మిగిలిన ఆ రెండు రికార్డుల్ని కూడా బద్దలు కొట్టడం ఖాయం. 35 ఏళ్ల విరాట్ ఇప్పటివరకు 114 టెస్టుల్లో 29 సెంచరీలతో 8871 పరుగులు చేశాడు. 295 వన్డేల్లో 50 సెంచరీలతో 13906 పరుగులు, 125 టి20లో 1 సెంచరీ, 38 హాఫ్ సెంచరీలతో 4188 పరుగులు చేశాడు. విరాట్ తాజాగా టీ20 నుంచి రిటైర్ అయ్యాడు. అయితే వన్డే, టెస్టుల్లో మాత్రం కొనసాగుతున్నాడు. ఈ ఫార్మేట్ కి విరాట్ రిటైర్ కావడానికి చాలా సమయం ఉంది. కాబట్టి అతని ఖాతాలో మరిన్ని రికార్డులు వచ్చి చేరడం ఖాయం.

Also Read: 2025 Champions Trophy: బాబర్ కే జై కొడుతున్నపీసీబీ