Site icon HashtagU Telugu

IND vs AUS 4th Test: కోహ్లీ కారణంగానే జైస్వాల్ అవుట్ అయ్యాడా?

Yashasvi Jaiswal Runout

Yashasvi Jaiswal Runout

IND vs AUS 4th Test: మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత క్రికెట్ జట్టు యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జైస్వాల్ అటాకింగ్ చూసి ఆసీస్ బౌలర్లు బిత్తరపోయారు. ఆరంభం నుంచే ఉపందుకున్నాడు. మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ వంటి బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. బలమైన షాట్లు కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఆరంభంలో రోహిత్ 3 పరుగుల వద్ద అవుట్ అవ్వగా కేఎల్ రాహుల్ జైస్వాల్ తో కలిసి మంచి ఆరంభాన్నిచ్చాడు. ఈ క్రమంలో జైస్వాల్, రాహుల్ మధ్య మంచి భాగస్వామ్యం ఏర్పడింది. అయితే కేఎల్ ఎంతోసేపు నిలవలేదు.

కేఎల్ 24 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత కోహ్లీతో కలిసి జైస్వాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఓ వైపు జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని సెంచరీ వైపు కదులుతున్నాడు. కోహ్లీ కూడా 32 పరుగులతో దూకుడు మీదున్నాడు. కానీ వీళ్లిద్దరి భాగస్వామ్యాన్ని స్కాట్ బోలాండ్ విడగొట్టి గేమ్ చేంజర్ గా మారాడు. 82 పరుగుల వద్ద జైస్వాల్ ని స్కాట్ బోలాండ్ రన్ అవుట్ చేసి టీమిండియాను దెబ్బ కొట్టాడు. జైస్వాల్ రన్ తీసుకునే ప్రయత్నంలో రనౌట్ అయ్యాడు. జైస్వాల్ బంతిని కొట్టగా మరో ఎండ్ లో ఉన్న విరాట్ కోహ్లీ పరుగు కోసం ప్రయత్నించి బంతిని గమనించి వెంటనే క్రీజ్‌లోకి వచ్చాడు. బంతి ఎక్కువ దూరం వెళ్లకపోవడంతోనే విరాట్ వెనక్కి తగ్గాడు. అయితే ఇదేమి గమనించని జైస్వాల్ విరాట్ వద్దకు వచ్చేశాడు. ఫీల్డర్ బంతిని వికెట్ కీపర్‌కు విసిరేయడంతో జైస్వాల్ రనౌట్ అయ్యాడు. ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జైస్వాల్ రనౌట్ అయ్యాడు.

సెంచరీకి దగ్గరగా వెళ్తున్న క్రమంలో జైస్వాల్ రన్ అవుట్ కావడంతో బాధగా వెనుదిరిగాడు. అయితే ఇదంతా అకస్మాత్తుగా జరిగిపోవడంతో ఇక్కడ ఎవర్ని తప్పు పట్టేది లేదు. ఆస్ట్రేలియా పర్యటనలో జైస్వాల్ రెండో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇకపోతే రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ చివరి ఓవర్లలో కేవలం 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు. పంత్ 6, జడేజా 4 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. 24 పరుగుల వద్ద రాహుల్ ఔట్ కాగా 36 పరుగుల వద్ద కోహ్లీ ఔటయ్యాడు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 474 పరుగుల వద్ద ముగిసింది.