Site icon HashtagU Telugu

IND vs AUS 1st Test: పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్

Border-Gavaskar Trophy

Border-Gavaskar Trophy

IND vs AUS 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై ఫస్ట్ టెస్టులోనే భారత్ జట్టు 295 పరుగుల తేడాతో గెలుపు జెండా ఎగురవేసింది. పెర్త్ వేదికగా సోమవారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో 534 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా టీమ్‌ను 238 పరుగులకే టీమిండియా బౌలర్లు కుప్పకూల్చారు. దాంతో ఐదు టెస్టుల బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భారత్ జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో టెస్టు మ్యాచ్ డిసెంబరు 6 నుంచి అడిలైడ్ వేదికగా జరగనుంది.

పెర్త్ టెస్ట్‌లో భారత బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా బోల్తా పడింది!

పెర్త్ లాంటి పిచ్‌పై 534 పరుగుల లక్ష్యఛేదన అసాధ్యం. అయితే.. ఆస్ట్రేలియా కనీసం మ్యాచ్ డ్రా కోసమైనా పోరాడుతుందని అంతా అనుకున్నారు. కానీ.. భారత్ బౌలర్ల ముందు ఆస్ట్రేలియా బ్యాటర్లు తేలిపోయారు. ఓపెనర్లు నాథన్ మెక్‌స్వీనీ (0), ఉస్మాన్ ఖవాజా (4) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్‌కి చేరిపోగా.. అనంతరం వచ్చిన నైట్‌ వాచ్‌మెన్ పాట్ కమిన్స్ (2), మార్కస్ లబుషేన్ (3)‌ కూడా కనీసం డబుల్ డిజిట్ స్కోరుని కూడా చేరుకోలేకపోయారు. దాంతో ఆస్ట్రేలియా టీమ్ 17/4తో పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయింది.

ఓ దశలో ట్రావిస్ హెడ్ (89: 101 బంతుల్లో 8×4), మిచెల్ మార్ష్ (47: 67 బంతుల్లో 3×4, 2×6) ఆ జట్టు పరువు నిలిపే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్‌కి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడితో ఆస్ట్రేలియా లో డ్రా ఆశలు మళ్లీ చిగురించాయి. కానీ.. ట్రావిస్ హెడ్‌ను బుమ్రా అవుట్ చేయగా.. మిచెల్ మార్ష్‌ను నితీశ్ రెడ్డి బోల్తా కొట్టించాడు. ఇక ఆఖర్లో అలెక్స్ క్యారీ (36), మిచెల్ స్టార్క్ (12), నాథన్ లయన్ (0) జోష్ హేజిల్‌వుడ్ (4) కాసేపు క్రీజులో నిలిచినా.. వారి ప్రయత్నం ఆస్ట్రేలియా టీమ్ ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించగలిగింది. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ మూడేసి వికెట్లు.. వాషింగ్టన్ సుందర్ రెండు, నితీశ్ రెడ్డి ఒక వికెట్ పడగొట్టారు.

అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్ ధాటితో ఆస్ట్రేలియాపై ఘన విజయం:

గత శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 49.4 ఓవర్లలో 150 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా టీమ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 104 పరుగులకే కుప్పకూలిపోయింది. దాంతో భారత్ జట్టుకి 46 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించగా.. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైశ్వాల్ (161), విరాట్ కోహ్లీ (100 నాటౌట్) సెంచరీలతో రెండో ఇన్నింగ్స్‌ను 487/6తో డిక్లేర్ చేసిన టీమిండియా.. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 46 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని 534 పరుగుల టార్గెట్‌ను ఆస్ట్రేలియా ముందు నిలిపింది. కానీ.. ఛేదనలో ఆస్ట్రేలియా 238 పరుగులకే ఆలౌటైపోయింది.

ఆస్ట్రేలియా గడ్డపై భారత్ అద్భుత విజయం: న్యూజిలాండ్ వైట్‌వాష్ తర్వాత ప్రతీకారం

భారత్ గడ్డపై ఇటీవల న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడిన టీమిండియా.. 0-3 తేడాతో వైట్‌వాష్‌కి గురైంది. దాంతో ఆస్ట్రేలియా గడ్డపై ఆ జట్టుకి కనీసం పోటీనైనా భారత్ ఇస్తుందా అని అనుకున్నారు. ఈ దశలో అనేక వెటకారపు మాటలు చాలా వినిపించాయి. అయితే.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో భారత్ జట్టు విజయాన్ని అందుకుంది.