Site icon HashtagU Telugu

IND Beat PAK: భారత్ వర్సెస్ పాకిస్తాన్.. ఉత్కంఠ పోరులో టీమ్ ఇండియాదే విజయం!

IND Beat PAK

IND Beat PAK

IND Beat PAK: ఆసియా కప్, మహిళల వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత- పాకిస్తాన్ (IND Beat PAK) జట్ల మధ్య హాంగ్‌కాంగ్ సిక్సెస్ 2025లో మరోసారి ఉత్కంఠభరితమైన పోరు జరిగింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మహా పోరాటంలో భారత్ మరోసారి పాకిస్తాన్‌ను ఓడించి సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ జట్టు 3 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది. సరిగ్గా అదే సమయంలో వర్షం పడడంతో డక్‌వర్త్ లూయిస్ నియమం (DLS) ప్రకారం టీమ్ ఇండియా 2 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారత్ గెలుపులో రాబిన్ ఉతప్ప కీలక పాత్ర పోషించారు. ఆయన మెరుపు బ్యాటింగ్‌తో 28 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నారు.

టీమ్ ఇండియా 86 పరుగులు

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. జట్టు తరఫున రాబిన్ ఉతప్ప అత్యధికంగా 11 బంతుల్లో 28 పరుగులు చేశాడు. ఉతప్ప మెరుపు ఇన్నింగ్స్‌లో 3 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. మరోవైపు భరత్ చిప్లి 13 బంతుల్లో 24 పరుగులు చేయగా, కెప్టెన్ దినేష్ కార్తీక్ 6 బంతుల్లో 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పాకిస్తాన్ తరఫున బౌలింగ్‌లో మహమ్మద్ షెహజాద్ ఒక ఓవర్‌లో 15 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

Also Read: Prithviraj Sukumaran: ‘కుంభ’గా పృథ్వీరాజ్ సుకుమారన్.. SSMB29 నుంచి సంచలన అప్‌డేట్!

పాకిస్తాన్ బ్యాటింగ్, DLS తో భారత్ విజయం

లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ జట్టుకు శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్‌లోనే తొలి వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత ఖ్వాజా నఫె, అబ్దుస్ సమద్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టి పాకిస్తాన్ స్కోరును 3 ఓవర్లలో 41 పరుగులకు చేర్చారు. ఈ సమయంలో ఖ్వాజా 18 పరుగులతో, సమద్ 16 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. ఆ తర్వాత వర్షం ప్రారంభం కావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిని అనుసరించి భారత్‌ను విజేతగా ప్రకటించారు. భారత్ తరఫున బౌలింగ్‌లో స్టువర్ట్ బిన్నీ ఒక ఓవర్‌లో 4 పరుగులిచ్చి 1 వికెట్ తీశారు.

హాంగ్‌కాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్‌లో టీమ్ ఇండియాకు ఇది తొలి మ్యాచ్. భారత్ విజయంతో ప్రారంభించడం విశేషం. పాకిస్తాన్‌కు ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ కువైట్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచినా, రెండో మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైంది.

Exit mobile version