Site icon HashtagU Telugu

T20I : మళ్లీ దుమ్మురేపిన యువభారత్..రెండో టీ ట్వంటీ కూడా మనదే

India vs Afghanistan

Ind Beat Aus By 44 Runs

వరల్డ్ కప్ (World Cup ) పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో భారత జట్టు (Indian cricket Team) దూసుకెళుతోంది. సొంతగడ్డపై జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ (T20 ) లో ఆసీస్ (Australia ) పై వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. విశాఖ మ్యాచ్ లో గెలిచి జోరు మీదున్న యువభారత్ తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో మ్యాచ్ లోనూ అదరగొట్టింది. బ్యాటింగ్ లో భారీస్కోరు చేసి, బౌలింగ్ లోనూ చెలరేగిన టీమిండియా 44 పరుగుల తేడాతో (IND beat AUS by 44 runs) విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు జైశ్వాల్ , గైక్వాడ్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. భారీ షాట్లతో ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 5.5 ఓవర్లలోనే 77 పరుగులు జోడించారు. జైశ్వాల్ 25 బంతుల్లోనే 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. తర్వాత రుతురాజ్ గైక్వాడ్ , ఇషాన్ కిషన్ కూడా హాఫ్ సెంచరీలతో చెలరేగారు. గైక్వాడ్ 43 బంతుల్లో 58, ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 52 రన్స్ చేశారు. చివర్లో యువ సంచలనం రింకూ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ తో రెచ్చిపోయాడు. కేవలం 9 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టోయినిస్ తప్పిస్తే మిగిలిన వారంతా భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

ఛేజింగ్ లో ఆస్ట్రేలియా ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్లు త్వరగానే ఔటయ్యారు. స్మిత్ 19, షార్ట్ 19 , ఇంగ్లీస్ 2 పరుగులకే వెనుదిరిగారు. మాక్స్ వెల్ కూడా విఫలమయ్యాడు. దీంతో ఆసీస్ 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే స్టోయినిస్ , టిమ్ డేవిడ్ మెరుపులు మెరిపించారు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 7 ఓవర్లలోనే 81 పరుగులు జోడించారు. కీలక సమయంలో వీరి పార్టనర్ షిప్ ను రవి బిష్ణోయ్ బ్రేక్ చేశాడు. టిమ్ డేవిడ్ 22 బంతుల్లో 37 , స్టోయినిస్ 25 బంతుల్లో 45 పరుగులు చేశారు. వీరిద్దరూ ఔటవడంతో ఆసీస్ ఓటమి ఖాయమైంది. తర్వాతి బ్యాటర్లలో ఎవరూ క్రీజులో నిలవలేకపోవడంతో ఆసీస్ 191 పరుగులే చేయగలిగింది.భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3, ప్రసిద్ధ కృష్ణ 3 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల సిరీస్ భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ లో మూడో టీ ట్వంటీ మంగళవారం గౌహతిలో జరుగుతుంది.

Read Also : KCR : దుబ్బాక పెట్టిన భిక్ష వల్లే నేను ఈ స్థాయికి ఎదిగా – కేసీఆర్