Women’s IPL:5 జట్లు…20 లీగ్ మ్యాచ్ లు..2 వేదికలు

  • Written By:
  • Publish Date - October 13, 2022 / 12:37 PM IST

మహిళల ఐపీఎల్ పై బీసీసీఐ కసరత్తు షురూ చేసింది. వచ్చే ఏడాది ఆరంభం కానున్న ఈ మెగా టోర్నీకి సంబంధించి ప్లానింగ్ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం బోర్డు వర్గాల సమాచారం ప్రకారం ఆరంభ సీజన్ లో ఐదు జట్లు తలపడనుండగా… 2 వేదికల్లో 20 లీగ్ మ్యాచ్ లు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. 2023 మార్చిలో తొలి సీజన్ జరగనుండగా… ప్రతీ జట్టు మిగిలిన జట్లతో రెండేసి మ్యాచ్ లు ఆడేలా లీగ్ స్టేజ్ ను రూపొందిస్తున్నారు. లీగ్ స్టేజ్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకోనుండగా.. రెండు , మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఎలిమినేటర్ జరుగుతుంది. దీనిలో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళుతుంది. తొలి సీజన్ కావడంతో రెండు వేదికల్లో టోర్నీ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. తర్వాత 2024 , 2025 సీజన్లకు వేదికల సంఖ్య పెంచాలని బీసీసీఐ ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. దీని ప్రకారం ఒక దశ మ్యాచ్‌లన్నీ ఒక వేదికలో జరిగిన తర్వాత మరో దశ కోసం ఇంకో నగరానికి టీమ్స్ వెళ్ళనున్నాయి.

ఇక టోర్నీ నిబంధనలను చూస్తే తుది జట్టులో కనీసం ఐదుగురు విదేశీ ప్లేయర్లు ఆడే అవకాశం కల్పించారు. ఇక ప్రస్తుతం మహిళల ఐపీఎల్ జట్లను కొనేందుకు కూడా పలు కార్పొరేట్ దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం ఐపీఎల్ లో ఉన్న ముంబై, చెన్నై, ఢిల్లీ ఫ్రాంచైజీలతో పాటు ఇతర కార్పొరేట్ కంపెనీలు జట్లను కొనేందుకు ఆసక్తిగా ఉన్నాయి. అయితే ఐదు జట్లనూ జోన్ల వారీగా అమ్మాలని బీసీసీఐ నిర్ణయించింది. దీని ప్రకారం నార్త్ జోన్ లో ధర్మశాల-జమ్ము, సౌత్ జోన్ లో కొచ్చి/వైజాగ్ , సెంట్రలో జోన్ లో ఇండోర్/నాగ్ పూర్/రాయ్ పూర్, ఈస్ట్ జోన్ లో రాంఛీ/కటక్, నార్త్ ఈస్ట్ లో గౌహతీ, వెస్ట్ జోన్ పుణే/రాజ్ కోట్ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. మొదటి పద్ధతిలో మ్యాచ్‌లు ఐపీఎల్‌ వేదికల్లోనే జరుగుతాయి. ఒకవేళ జోన్‌ వారీగా టీమ్స్ ఇవ్వాలని నిర్ణయిస్తే ఐపీఎల్‌ వేదికలు కాని వాటిలో మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఈ మొత్తం ప్రతిపాదనలకు సంబంధించి వచ్చే వార్షక సమావేశంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. కొత్త ఛైర్మన్ గా అరుణ్ ధమాల్ , బీసీసీఐ కొత్త ప్రెసిడెంట్ గా రోజర్ బిన్నీ ఎన్నిక ఖాయమైన నేపథ్యంలో ఏజీఎం తర్వాత మహిళల ఐపీఎల్ షెడ్యూల్ , టీమ్స్ కు సంబంధించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.