Site icon HashtagU Telugu

Shane Warne and RR: ఓనర్‌కే వార్నింగ్ ఇచ్చిన వార్న్…ఎందుకో తెలుసా ?

shane warne RR

shane warne RR

ఐపీఎల్ ఆరంభ సీజన్‌లో ఎవరూ ఊహించని విధంగా రాజస్థాన్ రాయల్స్ టైటిల్ ఎగరేసుకుపోయింది. షేన్‌వార్న్ సారథ్యంలోని పూర్తి యువ క్రికెటర్లతో నిండిన రాయల్స్ అద్భుతమైన ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచింది. అంచనాలున్న ముంబై, చెన్నై, హైదరాబాద్ లాంటి టీమ్స్‌ను నిలువరించి రాజస్థాన్‌ విజయం సాధించింది. ఈ విజయం వెనుక జట్టు సమిష్టి కృషితో పాటు షేన్‌వార్న్ కెప్టెన్సీ వ్యూహాలు ఎంతో కీలకపాత్ర పోషించాయి. జట్టును లీడ్ చేసే విషయంలో వార్న్ అసలు రాజీపడేవాడు కాదని రాజస్థాన్ వర్గాలు తెలిపాయి. తాజాగా షేన్‌వార్న్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి ఆ తొలి సీజన్‌ జరుగుతుండగా జట్టును వీడి వెళ్ళేందుకు వార్న్ సిద్ధమైనట్టు ఎవ్వరికీ తెలీదు. దీని కోసం రాజస్థాన్ కో ఓనర్‌కు అతను వార్నింగ్ ఇచ్చిన విషయం ఇప్పుడు వైరల్‌గా మారింది. జట్టు ఎంపిక విషయంలో రాయల్స్‌ యజమాని మనోజ్‌ బడాలేతో వార్న్‌కు విభేదాలు తలెత్తడమే దీనికి కారణం. వార్న్‌ ఆటో బయోగ్రఫీ నో స్పిన్‌ బుక్‌ ద్వారా ఈ విషయం వెల్లడైంది.

రాయల్స్‌ 16 మంది సభ్యుల జట్టులో ఓ ప్లేయర్‌ను చేర్చాలని భావించిన రాయల్స్‌ ఓనర్‌ మనోజ్‌ ఆ విషయాన్ని వార్న్‌కు చెప్పారు. అయితే అతని రికార్డు, ట్రయల్స్‌లో అతని ఆటతీరు వార్న్‌కు నచ్చలేదు. దీంతో అతన్ని జట్టులోకి తీసుకునేందుకు వార్న్ ఇష్టపడలేదు. కానీ మనోజ్‌ మాత్రం ఆసిఫ్‌ను చేర్చాలని పట్టుబట్టారు. దీంతో మనోజ్‌ ప్రతిపాదనను సూటిగా తిరస్కరించిన వార్న్‌.. అలా చేస్తే డ్రెస్సింగ్ రూమ్‌లో తన గౌరవం పోతుందని చెప్పాడు. ఎవరికో లాభం చేకూర్చేందుకు మాత్రమే అతన్ని డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోబెట్టామని మిగతా ప్లేయర్స్‌ అనుకుంటారన్నాడు.

అలా చేస్తే మిగిలిన ప్లేయర్స్‌ తనకు గౌరవం ఇవ్వరని, నేను తీసుకోలేనంటూ తేల్చి చెప్పేశాడు. వాళ్లు తనకు గౌరవం ఇవ్వరని వార్న్‌ స్పష్టం చేశాడు. ఇంత చెప్పినా కూడా అతన్ని ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే తాను జట్టులో ఉండనని వార్న్ మనోజ్‌కు స్పష్టం చేసాడు. మీ డబ్బు వెనక్కి ఇచ్చేసి వెళ్లిపోతానని తెగేసి చెప్పినట్టు బుక్‌లో పేర్కొన్నాడు. ఈ విషయంలో సీరియస్‌గా ఉన్నావా అని మనోజ్‌ అడిగితే.. అవును అని వార్న్‌ తేల్చి చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక మనోజ్ వెనక్కి తగ్గారు. రాజస్థాన్ రాయల్స్‌ ఇన్నేళ్ళ తర్వాత ఫైనల్‌కు చేరడం, షేన్‌వార్న్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న సందర్భంగా ఈ విషయం కూడా వైరల్‌గా మారింది.

Exit mobile version