Site icon HashtagU Telugu

Debutants @ IPL: అరంగేట్రం అదిరింది…

Ipl

Ipl

ఇండియన్ ప్రీమియర్ లీగ్…ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపించే లీగ్ మాత్రమే కాదు…యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చేందుకు చక్కని వేదిక..ఈ వేదికపై 15వ సీజన్ లో కూడా పలువురు యువ క్రికెటర్లు సత్తా చాటారు. ఏ మాత్రం అంచనాలు లేనప్పటికీ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

ఐపీఎల్ 2022 సీజన్ లో అందరినీ ఆకట్టుకున్న కొద్ది మంది యువ ఆటగాళ్లలో ముందు చెప్పుకోవాల్సింది తెలుగు తేజం తిలక్ వర్మ గురించే. మెగా వేలంలో ఊహించని విధంగా 20 లక్షల కనీస ధరతో ఉన్న తిలక్ వర్మ ను ముంబై ఇండియన్స్ 1.7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ముంబై జట్టు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వందకు వందశాతం ఈ హైదరాబాదీ క్రికెటర్ నిలబెట్టుకున్నాడు.ముంబై ఈ ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉన్నప్పటికీ కొన్ని మ్యాచ్‌ల్లో విజయం సాధించిందంటే అందుకు ప్రధాన కారణమైన ఆటగాళ్లలో తిలక్ వర్మ కూడా ఒకడు. ఆటగాళ్లంతా పేలవ ప్రదర్శనతో వెనుదిరుగుతున్న వేళ ఈ లెఫ్టార్మ్ బ్యాటర్ పలు కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు. 14 మ్యాచ్‌ల్లో 36.09 సగటుతో 397 పరుగులతో ఆరంభంలోనే అదరగొట్టాడు. త్వరలోనే తిలక్ వర్మ టీమిండియాకు ఆడే అవకాశముంది.

ఈ సీజన్‌తోనే అరంగేట్రం చేసిన మరో ఆటగాడు జితేష్ శర్మ. పంజాబ్ కింగ్స్ తరుఫున ఆడిన ఇతడు 2016లోనే ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నా తుది జట్టులో ఆడే అవకాశం రాలేదు. చాలా సుదీర్ఘ విరామం తర్వాత ఈ సీజన్‌లో పంజాబ్ తరఫున ఆడే ఛాన్స్ అవకాశం వచ్చింది. ఈ సీజన్‌లో పంజాబ్ తరఫున స్థిరంగా ఆడిన బ్యాటింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. 12 మ్యాచ్‌ల్లో 163.64 స్ట్రైక్ రేటుతో 234 పరుగులు చేశాడు.

లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడి ఆకట్టుకున్న యువ ఆటగాడు ఆయుష్ బదోనీ. ఇతడు 360 డిగ్రీల షాట్‌తో ఈ సీజన్‌లో డివిలియర్స్‌ను మరిపించాడు. దూకుడైన బ్యాటింగ్ ఎటాక్‌తో బదోనీ అదరగొట్టాడు. ఈ 22 ఏళ్ల యువ క్రికెటర్ 13 మ్యాచ్‌ల్లో 161 పరుగులే చేసినా వచ్చే సీజన్‌లో అతడు మరింత మెరుగుపడే అవకాశముంది. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఈ సీజన్‌లోనే అరంగేట్రం చేసిన మరో ప్లేయర్ మోనిస్ ఖాన్. ఈ లెఫ్టార్మ్ సీమర్.. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5.96 ఎకానమీ రేటుతో 14 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లయిన డుప్లెసిస్ వంటి ప్లేయర్స్ ను బాగా ఇబ్బంది పెట్టాడు. ఈ సీజన్‌లో అత్యుత్తమ బౌలర్ల జాబితాలో చోటు దక్కిచుకున్నాడు. గత కొన్నేళ్లుగా లెఫ్టార్మ్ సీమర్ కోసం వెతుకుతున్న భారత్ కు మొనిస్ మంచి ఆప్షన్‌గా చెప్పొచ్చు.

Exit mobile version