Site icon HashtagU Telugu

GT vs MI Eliminator Match: రేపు ఎలిమినేట‌ర్ మ్యాచ్‌.. ముంబై, గుజ‌రాత్ జ‌ట్ల‌కు కొత్త టెన్ష‌న్‌!

GT vs MI Eliminator Match

GT vs MI Eliminator Match

GT vs MI Eliminator Match: ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్, హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ (GT vs MI Eliminator Match) మధ్య జరగనుంది. ఈ పోరులో విజ‌యం సాధించిన జట్టు క్వాలిఫయర్-2 ఆడుతుంది. అయితే ఓడిన జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమిస్తుంది. ఎలిమినేటర్ మ్యాచ్ మొహాలీలోని ముల్లంపూర్ స్టేడియం (కొత్త పీసీఏ స్టేడియం)లో జరగనుంది. అయితే ఇక్క‌డ మ్యాచ్ జ‌రిగే స‌మ‌యంలో (మే 30, 2025) వర్షం పడే అవకాశం ఉంది.

గుజరాత్ టైటాన్స్ సీజన్ ప్రారంభం నుండి నంబర్-2 స్థానం కోసం బలంగా ఉంది. కానీ చివరి రెండు మ్యాచ్‌లలో ఓటములు గుజ‌రాత్ స్థానానికి ఎస‌రు పెట్టాయి. ప్రారంభ ఓటమి తర్వాత ముంబై ఇండియన్స్ కూడా విజయ రథంపై స్వారీ చేసింది. కానీ లీగ్ దశ చివరి మూడు మ్యాచ్‌లలో రెండింటిలో ఓడిపోవడంతో హార్దిక్ పాండ్యా జట్టు నాల్గవ స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ రెండు జట్లు టైటిల్ గెలవడానికి వరుసగా మూడు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది.

ఎలిమినేటర్ మ్యాచ్‌ను గెలిచిన జట్టు క్వాలిఫయర్-2కు వెళ్తుంది. ఓడిన జట్టు టోర్నమెంట్ నుండి నిష్క్రమిస్తుందని తెలిసిందే. కానీ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఏమవుతుంది? అనేది చాలామంది క్రికెట్ అభిమానుల‌కు తెలియ‌దు.

Also Read: Amazon Bazaar : అదిరిపోయేలా అమేజాన్ బజార్ లో ట్రావెల్ డీల్స్ ..!

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ ఫార్మాట్

ఐపీఎల్ ప్లేఆఫ్ ఫార్మాట్ ప్రకారం.. టాప్-2 జట్లు క్వాలిఫయర్-1 ఆడతాయి. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఓడిన జట్టు ఫైనల్‌కు వెళ్లడానికి క్వాలిఫయర్-2 గెలవాల్సి ఉంటుంది. ఎలిమినేటర్ మ్యాచ్ మూడవ, నాల్గవ స్థానంలో ఉన్న జట్ల మధ్య జరుగుతుంది. గుజరాత్ టైటాన్స్ పాయింట్ల ప‌ట్టిక‌లో మూడవ స్థానంలో, ముంబై ఇండియన్స్ నాల్గవ స్థానంలో నిలిచాయి.

మ్యాచ్ రోజు వాతావరణం ఎలా ఉంటుంది?

గుజరాత్- ముంబై మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ మే 30న మొహాలీలోని ముల్లంపూర్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. రేపు మొహాలీలో వర్షం పడే అవకాశం ఉంది. మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది,. మ్యాచ్ సమయంలో కూడా వర్షం ఉంటుందని అంచనా.

ఎలిమినేటర్ మ్యాచ్ రద్దయితే ఏ జట్టు ఇంటికి వెళ్తుంది?

గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. అంటే మ్యాచ్ ఒకే రోజులో పూర్తి కావాలి. ఒకవేళ అది సాధ్యం కాకపోతే.. నియమం ప్రకారం ముంబై ఇండియన్స్ బయటకు వెళ్తుంది. ఎందుకంటే ఎంఐ నాల్గవ స్థానంలో ఉంది. అయితే గుజరాత్ టైటాన్స్ క్వాలిఫయర్-2కు చేరుకుంటుంది. ఎందుకంటే జీటీ మూడవ స్థానంలో ఉంది. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్‌లో క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్‌లకు మాత్రమే రిజర్వ్ డే ఉంది. ఈ నియమం ప్రకారం.. వర్షం కారణంగా ఆ రోజు మ్యాచ్ జరగకపోతే తదుపరి రోజు మ్యాచ్ ఆడ‌తారు. ఒక‌వేళ వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ మ‌ధ్య‌లో ఆగిపోతే మ‌రుస‌టి రోజు మ్యాచ్ ఆగిపోయిన చోట నుండి కొనసాగుతుంది. రెండవ క్వాలిఫయర్ జూన్ 1న, ఫైనల్ జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.