Ravichandran Ashwin: టెస్టుల్లో నెంబర్ 1 బౌలర్‌గా అశ్విన్‌

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ల హవా కొనసాగుతోంది.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ల హవా కొనసాగుతోంది. ప్రతీ ఫార్మాట్‌లో ఏదో ఒక విభాగంలో భారత ఆటగాళ్ళు అగ్రస్థానంలో ఉన్నారు. తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ బౌలర్ల జాబితాకు సంబంధించి సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ (Ravichandran Ashwin) నెంబర్‌ వన్ ర్యాంకులో నిలిచాడు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదరగొడుతున్న అశ్విన్‌ ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్‌కు దూసుకెళ్ళాడు. అశ్విన్ ప్రస్తుతం 864 పాయింట్లతో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉండగా.. ఆండర్సన్ రెండో స్థానంలో నిలిచాడు. 2015లో తొలిసారి టెస్టుల్లో టాప్ ర్యాంకులో నిలిచిన యాష్ మళ్ళీ 8 ఏళ్ళ తర్వాత నెంబర్ వన్‌గా నిలిచాడు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో స్పిన్నర్ల హవానే కొనసాగుతుండడంతో.. ఈ సిరీస్ ముగిసేటప్పటికీ అశ్విన్ (Ravichandran Ashwin) తన టాప్ ప్లేస్‌ను మరింత పటిష్టం చేసుకునే అవకాశముంది. అటు ఆల్‌రౌండర్ల జాబితాలోనూ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. అశ్విన్‌తో పాటు ఆసీస్‌తో టెస్ట్ సిరీస్‌లో అదరగొడుతున్న రవీంద్ర జడేజా ఒక స్థానం మెరుగుపరుచుకుని 8వ ర్యాంకులో నిలిచాడు. అటు టెస్ట్ ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా నెంబర్ వన్‌గా కొనసాగుతున్నాడు. ఇక ఆరు నెలలకు పైగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన జస్ప్రీత్ బూమ్రా నాలుగో ర్యాంకులో ఉన్నాడు.

కాగా గత మూడు వారాలుగా టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంక్ చేతులు మారుతూ వస్తోంది. ఆసీస్ టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమ్మన్స్ అగ్రస్థానంలో ఉంటే.. గతవారం ఆండర్సన్ టాప్ ప్లేస్‌కు వచ్చాడు. ఈ వారం మళ్ళీ అశ్విన్‌ (Ravichandran Ashwin) నెంబర్ వన్ ర్యాంకులో నిలిచాడు. ఇదిలా ఉంటే టెస్ట్ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ క్రికెటర్ లబూషేన్ నెంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. స్మిత్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రాణించిన ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్‌ 871 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. కాగా బ్యాటింగ్ జాబితాలో భారత్ నుంచి రిషబ్ పంత్ 8వ స్థానంలోనూ, కెప్టెన్ రోహిత్‌శర్మ 9వ ర్యాంకులోనూ ఉన్నారు.

Also Read:  Australia vs India in Indore: ఇండోర్‌లో తొలిరోజు ఆసీస్‌దే