ICC Nominations: ఐసీసీ ప్రెసిడెంట్ రేస్.. నామినేషన్లకు అక్టోబర్ 20 డెడ్ లైన్!

అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్యలో భారత్ ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  • Written By:
  • Publish Date - October 8, 2022 / 09:55 PM IST

అంతర్జాతీయ క్రికెట్ సమాఖ్యలో భారత్ ఆధిపత్యం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శరద్ పొవార్, దాల్మియా, శశాంక్ మనోహర్ వంటి వాళ్ళు ఐసీసీలో అత్యున్నత పదవులు చేపట్టినవారే. అయితే శశాంక్ మనోహర్ తర్వాత మధ్యలో బీసీసీఐ నుంచి ప్రాతినిథ్యం తగ్గినప్పటకీ.. సౌరవ్ గంగూలీ, అమిత్ షాల రాకతో మళ్లీ ఐసీసీలో భారత్ ప్రాధాన్యత బాగానే పెరిగింది. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఐసీసీలో పాగా వేసేందుకు బీసీసీఐకి చక్కని అవకాశం ఎదురుచూస్తోంది. ఐసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న గ్రెగ్ బార్క్ లే పదవీకాలం నవంబర్ తో ముగియనుంది. దీంతో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి.

ఈ సారి ఐసీసీ బాస్ రేసులో సౌరవ్ గంగూలీ పేరు వినిపిస్తోంది. అధ్యక్ష పదవి కోసం నామినేషన్లు దాఖలు చేసేందుకు అక్టోబర్ 20 చివరి తేదీగా నిర్ణయించింది. బీసీసీఐ వార్షిక సమావేశం అక్టోబర్ 18న జరగనుండగా.. ఈ రోజే గంగూలీ భవితవ్యం తేలనుంది. ఐసీసీ ప్రెసిడెంట్ గా పోటీ చేయాలనుకుంటున్న దాదా బీసీసీఐ బాస్ గా తప్పుకోవాల్సి ఉంటుంది. చాలా కాలంగా దీనిపై వార్తలు వస్తున్నా గంగూలీ మాత్రం సమాధానం దాటవేస్తున్నాడు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో బీసీసీఐ రాజ్యాంగంలో సవరణలు చేసుకునేందుకు కూడా వీలు కలిగింది. అయితే ఐసీసీ పదవికి తాను పోటీ పడుతున్న వార్తలపై దాదా ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం గంగూలీ నామినేషన్ వేయనున్నట్టు తెలుస్తోంది.

ఒకదశలో సెక్రటరీ జైషా కూడా పోటీ పడుతున్నట్టు వార్తలు వినిపించినా క్రికెటర్ గానూ, అడ్మినిస్ట్రేటర్ గా సక్సెస్ ఫుల్ అయిన దాదా వైపే బోర్డులో మెజారిటీ వర్గాలు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఐసీసీ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు సరిగ్గా రెండు రోజుల ముందు బీసీసీఐ ఏజీఎం జరగనుంది. అదే రోజు గంగూలీ పోటీ చేయడంపై పూర్తి క్లారిటీ రానుంది. ప్రస్తుతం ప్రెసిడెంట్ గా ఉన్న బార్క్ లే మరోసారి పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరన్న వార్తల నేపథ్యంలో గంగూలీనే తర్వాతి బాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.