Andy Pycroft: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇటీవల ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycroft)ను లక్ష్యంగా చేసుకుంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లో జరిగిన ‘హ్యాండ్‌షేక్ వివాదం’ తర్వాత ఆయన పేరు బాగా చర్చనీయాంశమైంది. పీసీబీ ఏకంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఆండీ పైక్రాఫ్ట్‌పై ఫిర్యాదు కూడా చేసింది. అయితే ఆండీ పైక్రాఫ్ట్ ఎవరు? ఆయన చుట్టూ ఇంత వివాదం ఎందుకు జరిగింది?
ఈ వివాదం సెప్టెంబర్ 14న జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌తో ముడిపడి ఉంది. భారత జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు. అంతేకాదు అంతకుముందు టాస్ సమయంలో కూడా ఇరు జట్ల కెప్టెన్లు సల్మాన్ అఘా, సూర్యకుమార్ యాదవ్ చేతులు కలపలేదు. పీసీబీ ఐసీసీకి చేసిన ఫిర్యాదులో సల్మాన్ అఘాను భారత కెప్టెన్‌తో కరచాలనం చేయవద్దని చెప్పింది ఆండీ పైక్రాఫ్టే అని పేర్కొంది. ఈ కారణంగానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆయన్ని ఆసియా కప్ మ్యాచ్ రిఫరీల ప్యానెల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.
Also Read: Voting Machines: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు.. కీలక మార్పులు చేసిన ఎన్నికల కమిషన్!
ఎవరు ఈ ఆండీ పైక్రాఫ్ట్?
ఆండీ పైక్రాఫ్ట్ జింబాబ్వేకు చెందిన మాజీ క్రికెటర్. ఆయన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ పెద్దగా సాగలేదు. ఆయన కేవలం 3 టెస్టులు మరియు 20 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 447 పరుగులు చేశారు. కొంతకాలం పాటు జింబాబ్వే జాతీయ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేశారు. కానీ ఆటగాళ్ల ఎంపికపై వివాదం కారణంగా 2003 ప్రపంచ కప్ సమయంలో ఆ పదవిని విడిచిపెట్టారు.
ప్రస్తుతం పైక్రాఫ్ట్ క్రికెట్ ప్రపంచంలో అత్యంత అనుభవజ్ఞులైన మ్యాచ్ రిఫరీలలో ఒకరు. 2009 నుంచి ఇప్పటి వరకు ఆయన 103 టెస్టు మ్యాచ్‌లలో మ్యాచ్ రిఫరీగా పనిచేశారు. ఆయనకు భారతదేశంతో కూడా ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఎందుకంటే 1992లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన టెస్ట్ అరంగేట్రం చేశారు. ఆ మ్యాచ్‌లో ఆయన రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 39, 46 పరుగులు చేశారు.
