Bangladesh: టీ20 వరల్డ్ కప్ 2026 కోసం తమ జట్టును భారత్‌కు పంపేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) భీష్మించుకు కూర్చుంది. ఈ వివాదాన్ని వ్యక్తిగతంగా చర్చించి పరిష్కరించేందుకు ఐసీసీ (ICC) ప్రతినిధుల బృందం త్వరలోనే బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి భారత్- శ్రీలంక వేదికలుగా ప్రారంభం కానుంది.
బంగ్లాదేశ్ మొండి వైఖరి
బీసీబీ, బీసీసీఐ మధ్య వివాదం నడుస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ క్రీడా మంత్రిత్వ శాఖ, క్రికెట్ బోర్డు తమ జాతీయ జట్టును భారత్‌కు పంపబోమని, తమ మ్యాచ్‌లను కేవలం శ్రీలంకలోనే ఆడతామని మొండిగా వాదిస్తున్నాయి.
ఆటగాళ్ల భద్రతే కారణం
ప్రతిపాదిత ఐసీసీ బృందం పర్యటనను క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ గురువారం ధృవీకరించారు. ఫారిన్ సర్వీస్ అకాడమీలో మీడియాకు వివరాలు వెల్లడిస్తూ.. గ్లోబల్ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ఆసక్తిగా ఉన్నప్పటికీ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆటగాళ్ల భద్రత, రక్షణ తమకు అత్యంత ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు.
Also Read: ప్రారంభమైన రిపబ్లిక్ డే సేల్.. రూ. 50 వేలకే ఐఫోన్!
తన పంతం వీడని బీసీబీ
నజ్రుల్ మాట్లాడుతూ.. ‘తాజా సమాచారం ప్రకారం ఐసీసీ బృందం చర్చల కోసం బంగ్లాదేశ్‌కు వచ్చే అవకాశం ఉందని మిస్టర్ అమీనుల్ ఇస్లాం నాకు చెప్పారు. అయితే మా వైఖరి మార్చుకునే అవకాశం లేదు. మేము వరల్డ్ కప్‌లో ఆడాలనుకుంటున్నాము. ముఖ్యంగా శ్రీలంకలో. దీనిని నిర్వహించడం అసాధ్యమేమీ కాదని నేను నమ్ముతున్నాను’ అని అన్నారు.
ఐసీసీ విజ్ఞప్తి చేసినా
భారత్ నుండి తమ మ్యాచ్‌లను వేరే దేశానికి తరలించాలన్న డిమాండ్‌ను పునరాలోచించాలని ఐసీసీ ఇదివరకే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును కోరింది. అయినప్పటికీ బీసీబీ తన పంతాన్ని వీడడం లేదు. ఆటగాళ్ల భద్రతపై తమ ఆందోళనలను మరోసారి నొక్కి చెప్పింది.
