Bangladesh ICC T20 World Cup 2026 ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ భాగస్వామ్యంపై తుది నిర్ణయం జనవరి 21న వెలువడనుంది. భారత్‌లో మ్యాచ్‌లు ఆడటంపై భద్రతా కారణాలు చూపుతున్న బంగ్లాదేశ్, షెడ్యూల్‌లో మార్పులు చేయాలని కోరుతోంది. ఐసీసీ మాత్రం అందుకు అంగీకరించలేదు. బంగ్లాదేశ్ రాకపోతే స్కాట్లాండ్ వంటి ప్రత్యామ్నాయ జట్టుకు అవకాశం దక్కనుంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌తో ఐసీసీ ఎన్నో సార్లు చర్చలు జరిపింది. దాంతో తుది నిర్ణయం జనవరి 21 వ తేదీన వెలువడనుంది.
- భారత్‌లో టీ20 వరల్డ్‌కప్ ఆడబోమంటున్న బంగ్లాదేశ్
- జనవరి 21న తుది నిర్ణయం చెప్పాలంటూ ఐసీసీ డెడ్‌లైన్
- బంగ్లాదేశ్ ఆడకపోతే స్కాట్లాండ్ జట్టుకు అవకాశం
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై నెలకొన్న వివాదానికి త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశముంది. ఈ అంశంపై జనవరి 21న తుది కాల్ తీసుకుంటామని ఐసీసీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)కు స్పష్టంగా తెలియజేసినట్లు ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో నివేదిక వెల్లడించింది.
ఢాకాలో జరిగిన సమావేశంలో ఈ డెడ్‌లైన్‌ను ఐసీసీ అధికారికంగా బీసీబీ ముందుంచినట్లు సమాచారం. ఇదే వారం లోపల రెండు సార్లు ఐసీసీ – బీసీబీ మధ్య చర్చలు జరగగా, బంగ్లాదేశ్ మాత్రం తమ టీమ్ టీ20 వరల్డ్ కప్ ఆడుతుందనే చెప్పింది. అయితే భారత్‌కు వెళ్లి మ్యాచ్‌లు ఆడటం మాత్రం సాధ్యం కాదని, ఆటగాళ్ల భద్రతపై ఆందోళనలు ఉన్నాయని మరోసారి స్పష్టం చేసింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2026 స్క్వాడ్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను విడుదల చేయాలన్న బీసీసీఐ నిర్ణయం తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ తమ గ్రూప్ మ్యాచ్‌లను భారత్ వెలుపల నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఐసీసీ మాత్రం షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు చేయబోమని కఠినంగా చెబుతోంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ గ్రూప్ సీలో ఉంది. ఫిబ్రవరి 7న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. గ్రూప్ దశలోని మిగతా రెండు మ్యాచ్‌లు కూడా ఈడెన్ గార్డెన్స్‌లోనే జరగనుండగా, చివరి మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో జరగాల్సి ఉంది.
ఇటీవల చర్చల్లో బంగ్లాదేశ్ – ఐర్లాండ్ గ్రూప్ మార్పు ప్రతిపాదనను కూడా బీసీబీ ముందుకు తీసుకెళ్లింది. దీని ద్వారా బంగ్లాదేశ్ మ్యాచ్‌లు శ్రీలంకలో జరిగే అవకాశం ఉండేది. అయితే ఈ ప్రతిపాదనను ఐసీసీ పూర్తిగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, భారత్‌లో బంగ్లాదేశ్ జట్టుకు ఎలాంటి భద్రతా ముప్పు లేదని కూడా ఐసీసీ హామీ ఇచ్చింది.
మొత్తం మీద ఇప్పుడు ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డే. జనవరి 21లోగా భారత్‌కు రావడానికి ఒప్పుకోకపోతే, ఐసీసీ ప్రత్యామ్నాయ జట్టును ఎంపిక చేసే అవకాశం ఉంది. ప్రస్తుత ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్ ఆ అవకాశం దక్కించుకునే జట్టుగా భావిస్తున్నారు. బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వస్తే ఐసీసీ ఇప్పటికే అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయగలమన్న నమ్మకంతో ఉంది. అయితే బంగ్లాదేశ్ తుది నిర్ణయం ఏంటన్నదే ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ ముందు కీలకంగా మారింది.
