ICC: స్లో ఓవర్ రేట్ పై ఐసీసీ కొత్త రూల్

అంతర్జాతీయ క్రికెట్ లో స్లో ఓవర్ రేట్ సర్వసాధారణంగా మారిపోయింది. ఫార్మేట్ తో సంబంధం లేకుండా పలు జట్లు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయడంలో విఫలమవుతున్నాయి.

  • Written By:
  • Publish Date - January 7, 2022 / 04:21 PM IST

అంతర్జాతీయ క్రికెట్ లో స్లో ఓవర్ రేట్ సర్వసాధారణంగా మారిపోయింది. ఫార్మేట్ తో సంబంధం లేకుండా పలు జట్లు నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయడంలో విఫలమవుతున్నాయి. ఎక్కువ ఓవర్లకు పేసర్లను ఉపయోగించడం, తరచూ ఫీల్డింగ్ లో మార్పులు ఇలా సమయం వృథా అవుతుంది. ఈ కారణంగా అనుకున్న సమయానికి బౌలింగ్ కోటాను పూర్తి చేయలేకపోతున్నాయి. దీనికి పెనాల్టీగా ఐసీసీ ఆయా జట్ల ఆటగాళ్ళ మ్యాచ్ ఫీజులో కోత విధించడం, జట్టు కెప్టెన్ ను తర్వాతి మ్యాచ్ కు సస్పెండ్ చేయడం ఇలాంటి చర్యలు తీసుకుంటోంది. అయితే ఇవేమీ కూడా పరిస్థితిలో మార్పు తీసుకురాకపోవడంతో ఐసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై టీ ట్వంటీల్లో స్లో బౌలింగ్ చేస్తే ఫీల్డింగ్ జట్టు భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ఐసీసీ తెచ్చిన కొత్త నిబంధన ప్రకారం ఫీల్డింగ్ టీమ్ 20 ఓవర్ తొలి బంతిని తన నిర్ణీత సమయంలో వేయాల్సి ఉంటుంది. అలా వేయకుంటే 20 ఓవర్ జరుగుతున్న సమయంలో 30 యార్డ్ సర్కిల్ అవతల ఒక ఫీల్డర్ ను కోల్పోవాల్సి ఉంటుంది. అంటే కేవలం నలుగురు ఆటగాళ్ళే బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయాలి. ప్రస్తుతం ఐసీసీ నిబంధనల ప్రకారం పవర్ ప్లే తర్వాత సర్కిల్ అవతల ఐదుగురు ఫీల్డర్లు ఉండొచ్చు. ఇక 20 ఓవర్ నిర్ణీత సమయానికి వేయకుంటే మాత్రం ఆ సమయంలో నలుగురితోనే ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. చివరి ఓవర్ కావడంతో ఇది బ్యాటింగ్ టీమ్ కు అడ్వాంటేజ్ గా మారుతుంది. బ్యాటర్లు భారీ షాట్లు కొట్టే చివరి ఓవర్లో ఇలాంటి పరిస్థితి ఫీల్డింగ్ టీమ్ కు పెద్ద మైనస్ పాయింట్. దీంతో ఫీల్డింగ్ టీమ్ ఇకపై ఓవర్ రేట్ విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా చివరి ఓవర్లో ప్రత్యర్థి జట్టుకు భారీగా పరుగులు సమర్పించుకోవాల్సి ఉంటుంది.

కాగా ఈ నిబంధనను ఇప్పటికే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు హండ్రెడ్ లీగ్ లో అమలు చేసింది. ఐసీసీ కొత్తగా తీసుకొచ్చిన ఈ రూల్ ఈ నెల నుండే అమల్లోకి రానున్నాయి. విండీస్, ఐర్లాండ్ మధ్య జరిగే సిరీస్ తో ఈ కొత్త రూల్ అమలు చేయనున్నారు. ఇదిలా ఉంటే టీ ట్వంటీ మ్యాచ్ సమయంలో జట్లు ఒకసారి డ్రింక్స్ బ్రేక్ తీసుకోవచ్చు. రెండున్నర నిమిషాల పాటు బ్రేక్ తీసుకునే వెసులుబాటు కల్పించింది. అయితే ఇది ఆ సిరీస్ ఆడే ఇరు దేశాల క్రికెట్ బోర్డుల ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది.