ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి పాకిస్తాన్ ఆతిథ్యంలో ప్రారంభం కానుంది. 2017 తర్వాత ఈ టోర్నమెంట్ నిర్వహించబడుతోంది. ఈ టోర్నమెంట్‌లో 8 జట్లు పాల్గొంటున్నాయి. అయితే భారత్ హాట్ ఫెవరెట్ జట్టుగా బరిలోకి దిగనుంది. కాగా ఈ టోర్నమెంటు ఫైనల్ మ్యాచ్ ల్లో గెలిచే జట్టుపై ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి భారత జట్టు మాజీ కోచ్ రవిశాస్త్రి మరియు ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ పోరు మార్చి 9న తేలనుంది. అయితే ఈ టోర్నమెంట్ లో ఫైనలిస్ట్ జట్ల గురించి ముందే అంచనాలు వేశారు రవిశాస్త్రి మరియు రికీ పాంటింగ్. నిజానికి ఐసిసి రివ్యూలో రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ఛాంపియన్ టోర్నీ ఫైనల్ భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరగవచ్చని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఇరు జట్ల ఆటగాళ్లు బలంగా ఉన్నారని చెప్పాడు. ఇటీవల ఐసీసీ టోర్నీలలో ఈ రెండు జట్లే ప్రభావం చూపాయని పాంటింగ్ చెప్పాడు. కాగా రవిశాస్త్రి మాత్రం ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికా జట్లను సెమీ-ఫైనలిస్టులుగా ఎంపిక చేశాడు.
ఛాంపియన్ ట్రోఫీకి ముందు టీమిండియా ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ కోసం సిద్దమవుతుంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్ ను చిత్తూ చేసిన యువ భారత్ ఇప్పుడు వన్డేలోనూ సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. అయితే ఈ సిరీస్ కోసం సీనియర్లు బరిలోకి దిగనున్నారు. సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా నాలుగు ఒకటితో టి20 సిరీస్ కైవసం చేసుకోగా ఇప్పుడు రోహిత్ సారధ్యంలో వన్డే సిరీస్ కు సిద్ధమవుతున్నారు. టి20 విజయంతో సీనియర్లకు ఆత్మవిశ్వాసం పెరిగింది. వన్డేలో సత్తా చాటితే నెక్స్ట్ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనాల్సి ఉంది.