Site icon HashtagU Telugu

Ind vs SA: కిల్లర్ మిల్లర్ టార్గెట్ గా టీమిండియా

David Miller Bhuvaneshwar

David Miller Bhuvaneshwar

సౌతాఫ్రికాను ఓడించాలంటే ముందు ఆ టీమ్‌లో టాప్‌ ఫామ్‌లో ఉన్న డేవిడ్‌ మిల్లర్‌ను తొందరగా ఔట్‌ చేయాలి. ప్రస్తుతం టీమిండియా టార్గెట్‌ ఇదే. లేకుంటే మరో ఓటమికి సిద్దమవ్వాల్సిందే. ఈ విషయాన్ని టీమ్ ఇండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ అంగీకరించాడు. దీనిపై భువనేశ్వర్‌ స్పందిస్తూ.. అతనికి బౌలింగ్‌ చేయడం కష్టమనీ, అతడు చాలా మంచి ఫామ్‌లో ఉన్నాడనీ చెప్పాడు. సౌతాఫ్రికా అతన్ని టీమ్‌లో నుంచి తొలగించాలని తాను కోరుకుంటున్నాననీ, కానీ ఆ టీమ్‌ అలా చేయదన్నాడు. ఐపీఎల్‌ మొత్తం అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడనీ, అతనికి బౌలింగ్‌ చేయడం ఓ సవాలే అని భువీ ఒప్పుకున్నాడు.
తొలి మ్యాచ్‌లో మిల్లర్‌కు భువనేశ్వర్‌ 18వ ఓవర్‌ వేశాడు. మొదట్లోనే కెప్టెన్‌ బవుమా వికెట్‌ తీసి ఇండియాకు మంచి స్టార్ట్‌ ఇచ్చినా.. డెత్‌ ఓవర్లలో భువీ భారీగా రన్స్‌ ఇచ్చాడు. మిల్లర్ దెబ్బకు ఒక ఓవర్లో 22 రన్స్ సమర్పించుకున్నాడు.
బౌలింగ్‌ బాగా లేకపోవడం వల్లే తొలి మ్యాచ్‌లో ఓడిపోయామని, రెండో మ్యాచ్‌లో మెరుగ్గా బౌలింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తామని భువి చెప్పాడు. ఇప్పటికే నాలుగు టీ20లు మిగిలి ఉండటంతో సిరీస్‌ గెలిచే ఛాన్స్‌ తమకు ఉందని అన్నాడు. తొలి మ్యాచ్‌లో ఎక్కడ తప్పు జరిగిందో చర్చించుకున్నామని, టీమ్‌లో ఉన్న చాలా మంది ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించి వచ్చిన వాళ్లే కావడంతో ఎలా మెరగవ్వాలో అందరికీ తెలుసని భువీ వ్యాఖ్యానించాడు.

తొలి టీ20లో టీమిండియా ఓటమికి మిల్లర్ కారణం. ఐపీఎల్‌ మొత్తం టాప్‌ ఫామ్‌లో ఉన్న అతడు.. ఈ సిరీస్‌లోనూ కొనసాగిస్తున్నాడు.తొలి టీ20లో సౌతాఫ్రికా రికార్డు స్థాయిలో 212 రన్స్‌ చేజ్‌ చేయడంలో మిల్లరే కీలకపాత్ర పోషించాడు. అతడు కేవలం 31 బాల్స్‌లో 64 రన్స్‌ చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. టీ20ల్లో సౌతాఫ్రికా చేజ్‌ చేసిన అతిపెద్ద టార్గెట్‌ ఇదే. దీంతో రెండో టీ ట్వంటీ లోనూ మిల్లర్ పైనే అందరి దృష్టి ఉంది.ముఖ్యంగా మిల్లర్ ను కట్టడి చేయడం పైనే మన విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.