Rafael Nadal: వింబుల్డన్ నుంచి తప్పుకున్న నాదల్‌

వింబుల్టన్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే వార్త...

  • Written By:
  • Updated On - July 8, 2022 / 02:08 PM IST

వింబుల్టన్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే వార్త… ఈ ఏడాది వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదన్ వింబుల్డన్ నుంచి తప్పుకున్నాడు. సెమీఫైనల్ మ్యాచ్ కు ముందు గాయం కారణంగా వైదొలిగాడు. పొట్ట కండరాల్లో చీలిక కారణంగా తప్పుకుంటున్నట్టు నాదల్ ప్రకటించాడు. దురుదృష్టవశాత్తూ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వస్తోందంటూ మీడియా సమావేశంలో వెల్లడించాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ లోనే కడుపునొప్పితో ఇబ్బందిపడిన విషయాన్ని గుర్తు చేశాడు. లోపల ఏదో జరిగిందని భావించగా.. పొట్ట కండరాల్లో గాయం గురించి తెలిసిందన్నాడు. తప్పుకోవాలనుకున్న నిర్ణయంపై రోజంతా తీవ్రంగా ఆలోచించాల్సి వచ్చిందన్నాడు. అమెరికా ప్లేయర్ టేలర్‌ ఫ్రిట్జ్‌తో జరిగిన క్వార్టర్స్‌ మ్యాచ్‌లోనే నదాల్‌ చాలా నొప్పితో బాధపడ్డాడు.

అప్పుడే మ్యాచ్‌ నుంచి తప్పుకోవాలని అతని తండ్రి, సోదరి కోరినా అలాగే ఆడాడు. చివరికి నొప్పితో బాధపడుతూనే మ్యాచ్ గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. అయితే టైటిల్‌కు రెండు అడుగుల ముందు తప్పుకోవాల్సి రావడం అతని అభిమానులకు నిరాశ కలిగించేదే. తాను ఇలాగే ఆడటం కొనసాగిస్తే గాయం మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇలాంటి గాయంతో తాను రెండు వరుస మ్యాచ్‌లు గెలవలేనని స్పష్టం చేశాడు. సర్వీస్ చేయలేని పరిస్థితి ఉందని తెలిపాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లోనూ కాలి గాయంతో బాధపడిన నదాల్‌.. ఇంజెక్షన్లు తీసుకొని మరీ ఆడి గెలిచాడు. ఈ ఏడాది నాదల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ , ఫ్రెంచ్ ఓపెన్ గెలిచాడు. వింబుల్డన్‌లోనూ దూకుడుగా ఆడుతూ సెమీస్‌కు చేరిన స్పెయిన్ బుల్ టైటిల్ గెలవడం ఖాయంగా కనిపించింది. అయితే అనూహ్యంగా పొట్టలో సమస్యలతో తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో 1969లో రాడ్‌ లేవర్‌ తర్వాత క్యాలెండర్ ఇయర్‌ స్లామ్‌ సాధించాలనుకున్న నాదల్ కల నెరవేరలేదు.