Mohammed Siraj : మళ్ళీ ఆటతోనే జవాబిస్తా

భారత క్రికెట్ లో పేసర్ గా సత్తా చాటుతున్న హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు ఈ ఐపీఎల్ సీజన్ మాత్రం కలిసి రాలేదు. పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన సిరాజ్ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నాడు

  • Written By:
  • Publish Date - June 3, 2022 / 11:29 AM IST

భారత క్రికెట్ లో పేసర్ గా సత్తా చాటుతున్న హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు ఈ ఐపీఎల్ సీజన్ మాత్రం కలిసి రాలేదు. పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన సిరాజ్ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఐపీఎల్ 15వ సీజన్ తన ప్రదర్శనపై సిరాజ్ స్పందించాడు. ఈ సీజన్ తనకు కలిసి రాలేదని, తన కెరీర్ లో ఇదొక బ్యాడ్ ఫేజ్ గా అభివర్ణించాడు. ఐపీఎల్ లో చేసిన తప్పులను సవరించుకుంటూ ఆటతీరును మెరుగుపరుచుకోవడంపై ప్రస్తుతం దృష్టిసారించినట్లు తెలిపాడు. గత రెండు సీజన్స్ లో తన ప్రదర్శన ఆశాజనకంగా ఉన్నా…ఈ సారి మాత్రం దిగజారిపోయిందని సిరాజ్ అంగీకరించాడు. బలాలపై దృష్టిపెడుతూ మళ్ళీ ఫామ్ అందుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కు ప్రాతినిథ్యం వహిస్తున్న మహ్మద్ సిరాజ్ ఈ సీజన్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. 15 మ్యాచుల్లో 10.7 ఎకానమీ రేటుతో కేవలం తొమ్మిది వికెట్లు మాత్రమే తీయగలిరాడు. అన్నింటికీ మించి అతని పేస్ లో పదును తగ్గినట్టు కనిపించింది. సిరాజ్ బౌలింగ్ లో ప్రత్యర్థి బ్యాటర్లు ఏకంగా 31 సిక్స్ లు కొట్టారు. తద్వారా ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్స్ లను సమర్పించుకున్న బౌలర్ గా చెత్త రికార్డును సిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. జూలై 1 నుంచి 5 వరకు ఇంగ్లాండ్ తో జరుగనున్న టెస్ట్ జట్టు కోసం సిరాజ్ ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఈ టెస్ట్ కోసం కఠినంగా సాధన చేస్తున్నట్లు సిరాజ్ చెప్పుకొచ్చాడు. మళ్ళీ ఆటతోనే విమర్శలకు జవాబిస్తానని సిరాజ్ చెప్పాడు. ఇదిలా ఉంటే కరోనా కారణంగా గత ఏడాది జరగాల్సిన చివరి టెస్ట్ వాయిదాపడింది. ఇప్పటికే ఈ సిరీస్ లో భారత్ 2 -1 ఆధిక్యంలో ఉండగా… చివరి మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంటామని సిరాజ్ పేర్కొన్నాడు. లైన్ అండ్ లెంగ్త్ తో స్థిరంగా బౌలింగ్ చేయడం టెస్ట్ లో కీలకమని , అప్పుడే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి వికెట్లను తీయగలమని చెప్పాడు.ఆస్ట్రేలియాతో పాటు గత విదేశీ పర్యటనల్లో తాను నేర్చుకున్న ఈ ఫార్ములాతోనే ఇంగ్లాండ్ ను ఎదుర్కొనేందుకు తాను సిద్ధమైనట్లు సిరాజ్ తెలిపాడు.