ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బీసీసీఐ, ధోనీ గురించి మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు . బీసీసీఐ నుంచి తనకు ప్రోత్సాహం అందలేదని, జట్టు నుంచి అకారణంగా తప్పించారని అన్నాడు. ఈ విషయమై ధోనీని అడిగితే అతడు ఏమీ సమాధానం చెప్పలేదని అన్నాడు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయేమోనని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా దీనిపై భజ్జీ వివరణ ఇచ్చాడు. మహీతో తనకెలాంటి సమస్యలూ లేవనీ , నిజం చెప్పాలంటే ఎల్లవేళలా అతడు మంచి మిత్రుడునీ చెప్పుకొచ్చాడు. నిజం చెప్పాలంటే ధోనిని తాను పెళ్లి మాత్రమే చేసుకోలేదు అంటూ సరదాగా సమాధానమిచ్చాడు.
1998లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. అనతికాలంలో జట్టులో కీలక బౌలర్‌గా ఎదిగాడు. 31 ఏళ్లకే టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఎన్నో మ్యాచ్‌ల్లో తన స్పిన్ మాయజాలంతో టీమ్‌ఇండియాకు విజయాలందించిన భజ్జీ.. 2016 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించలేదు. అతడకి ఆ తర్వాత అవకాశాలు రాలేదు. మళ్లీ సెలక్టర్ల నుంచి పిలుపు వస్తుందని చాలా కాలంపాటు నిరీక్షించినా నిరాశే మిగిలింది. దీంతో ఈ వెటరన్ స్పిన్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.