IPL 2022:క్రికెట్ వదిలేద్దామనుకున్నా..

ఐపీఎల్‌-2022లో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్ అటు సారథిగా ఇటు బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్ 298 పరుగులు చేశాడు.

  • Written By:
  • Publish Date - May 4, 2022 / 02:41 PM IST

ఐపీఎల్‌-2022లో రాజస్తాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్ అటు సారథిగా ఇటు బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన సంజూ శాంసన్ 298 పరుగులు చేశాడు. ప్రసుతం శాంసన్ సారథ్యంలోని రాజస్తాన్‌ రాయల్స్ జట్టు 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అయితే ఈ సీజన్ లో సంజు శాంసన్ ఇదే నిలకడైన ఆటతీరును కొనసాగిస్తే .. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఇదిలాఉంటే.. ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ కపూర్ తో జరిగిన ఇంటర్వ్యూలో సంజూ శాంసన్ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

ముఖ్యంగా గత ఐదేళ్లలోతాను తీవ్ర మానసిక వేదనకి గురైనట్లు తెలిపాడు. నేను 20 ఏళ్ళ వయసులో జాతీయ జట్టులోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత మళ్లీ 5 ఏళ్లకు మళ్ళి టీంఇండియాలో ఛాన్స్ దొరికింది. నా లైఫ్ లో ఈ ఐదేళ్ల కాలం చాలా కష్టంగా గడిచింది. ఎప్పుడు చిరాకుగా ఉండేవాడిని. ఓ సారి బ్రబౌర్న్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఔటయ్యానన్న కోపంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లగానే బ్యాట్‌ విసిరేశాను. అలాగే ఆ మ్యాచ్‌ జరుగుతుండగానే స్టేడియం నుంచి బయటకు వెళ్ళిపోయాను. ఆ సమయంలో క్రికెట్‌ వదిలేద్దామనుకున్నా.. అలా ఆలోచిస్తూ బాగా పొద్దుపోయాక డ్రెస్సింగ్ రూమ్ కి తిరిగి వచ్చాను. అప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌లో నేను కోపంలో విరిరేసిన నా బ్యాట్‌ ముక్కలై ఉంది. దాంతో నా మీద నాకే కోపం వచ్చిందని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.