Site icon HashtagU Telugu

Football:పోరాడి ఓడిన హైదరాబాద్‌

Whatsapp Image 2022 01 09 At 22.09.03 Imresizer

football

గోవా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)-8వ సీజన్‌లో అద్భుతమైన ఆటతీరుతో దూసుకుపోతున్న హైదరాబాద్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (హెచ్‌ఎఫ్‌సీ) కేరళ బ్లాస్టర్స్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (కేబీఎఫ్‌సీ)తో మ్యాచ్‌లో తుదికంటూ పోరాడి పరాజయం పాలైంది. ఆదివారం తిలక్‌ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన పోరులో హైదరాబాద్‌ ఎఫ్‌సీ 0-1 స్కోరుతో పోరాడి ఓడింది. సారథి ఓగ్బాచె దూకుడుతో ప్రథమార్థంలో తొలి పది నిమిషాలు ప్రత్యర్థిపై హైదరాబాద్‌ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ తర్వాత ఇరు జట్లు గోల్‌ కోసం నువ్వానేనా? అన్నట్లు ఒకరి గోల్‌పోస్టులపై మరొకరు పోటాపోటీగా దాడులు చేశారు కానీ, గోల్‌ నమోదు కాలేదు. ఆట 24వ నిమిషంలో కేరళ దాదాపుగా తొలి గోల్‌ నమోదు చేసినంత పని చేసింది. కానీ, వారి ప్రయత్నాన్ని హైదరాబాద్‌ గోల్‌కీపర్‌ కట్టిమణి అద్భుతంగా నిలువరించి గోల్‌ను అడ్డుకున్నాడు. ప్రథమార్థం మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా కేరళ స్టార్‌ స్ట్రయికర్‌ అల్వారో వాస్క్వజ్‌ ఆట 42వ నిమిషంలో గోల్‌ సంధించి ఆ జట్టును ఆధిక్యంలో నిలిపాడు. దాంతో వెంటనే అప్రమత్తమైన హైదరాబాద్‌ డిఫెన్స్‌ను మరింత కట్టుదిట్టం చేసింది. విరామానికి వెళ్లే ముందు కెప్టెన్‌ ఓగ్బాచె గోల్‌ కోసం గట్టి ప్రయత్నం చేసినా ఫలించలేదు.

ఆరంభం నుంచే..
విరామం తర్వాత సాహిల్‌ స్థానంలో హితేష్‌ను బరిలోకి దింపిన హైదరాబాద్‌ ప్రత్యర్థి స్కోరును సమం చేయాలనే పట్టుదలతో ద్వితీయార్థ భాగాన్ని ఆరంభించింది. ఆట 53వ నిమిషంలో హెచ్‌ఎఫ్‌సీ రెప్పపాటులో గోల్‌ నమోదు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. హెచ్‌ఎఫ్‌సీకి మైదానం మధ్య నుంచి ఫ్రీకిక్‌ కొట్టే అవకాశం లభించగా అనికేత్‌ జాదవ్‌ దాదాపు కార్నర్‌ గోల్‌ కొట్టినంత పనిచేశాడు కానీ, త్రుటిలో అతడి గురి తప్పింది. అనంతరం ఇరు జట్లు పది నిమిషాలు పాటు బంతిపై నియంత్రణ కోసం తీవ్రంగా శ్రమించాయి. ఈ సమయంలో ఆట 60వ నిమిషంలో మరోసారి హైదరాబాద్‌కు బాక్స్‌ నుంచి ఫ్రీకిక్‌ కొట్టే చాన్స్‌ వచ్చింది. ఓగ్బాచె కొట్టిన కిక్‌ను గోల్‌పోస్టు సమీపంలో ప్రత్యర్థి డిఫెండర్‌ అడ్డుకోవడంతో హైదరాబాద్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. అయినా పట్టువదులని ఓగ్బాచె, అనికేత్‌ సహకారంతో 71వ నిమిషంలో మరోసారి కేరళ గోల్‌పోస్టుపై దాడి చేయగా, గోల్‌కీపర్‌ గిల్‌ అద్భుతమైన డైవ్‌తో దానిని అడ్డుకున్నాడు. సమయం దగ్గర పడుతుండడంతో గేమ్‌ ప్లాన్‌ను మార్చిన హైదరాబాద్‌ అనికేత్‌, నిఖిల్‌ స్థానాల్లో యాసిర్‌, రోహిత్‌ను బరిలోకి దింపింది. ఇక్కడ నుంచి స్కోరును సమం చేసేందుకు హైదరాబాద్‌ ఎఫ్‌సీ తన సర్వశక్తులను ఒడ్డింది కానీ అదృష్టం కలిసి రాలేదు. ప్రత్యర్థి డిఫెన్స్‌ను మూడుసార్లు ఛేదించి గోల్‌ పోస్టుపై దాడి అయితే చేయగలిగింది కానీ, గోల్‌ను కొట్టలేకపోవడంతో ఆఖరి క్షణం వరకు పోరాడినా హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు.