Site icon HashtagU Telugu

Koneru Humpy: చరిత్ర సృష్టించిన కోనేరు హంపి.. వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్ లో రజతం

Koneru Humpy

Resizeimagesize (1280 X 720)

ప్రపంచ బ్లిట్జ్‌ టోర్నీ చరిత్రలో తెలుగమ్మాయి కోనేరు హంపి (Koneru Humpy) చరిత్ర సృష్టించింది. ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో మొదటి రోజు పోటీల్లో 9 రౌండ్లు ముగిసేసరికి 44వ స్థానంలో ఉన్న ఆమె, 17 రౌండ్ల తర్వాత 12.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలి అయిదు గేముల్లో మూడు ఓటములు చవిచూసిన ఆమె, చివరి 12 రౌండ్లలో ఒక్క పరాజయం లేకుండా పోడియం ఎక్కడం విశేషం. ఈ క్రమంలో చివరి రౌండ్ లో టాన్‌ జాంగ్‌యీపై గెలిచి రజతం నెగ్గింది. అర పాయింట్‌ తేడాతో స్వర్ణాన్ని చేజార్చుకుంది. దిగ్గజ ఆటగాడు ఆనంద్‌ (2017) తర్వాత ఈ టోర్నీలో పతకం సాధించిన ఘనత హంపిదే.

ఫిడే వరల్డ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్ మహిళల విభాగంలో భారత వెటరన్ ప్లేయర్ కోనేరు హంపీ స్వల్ప తేడాతో వెనుదిరిగి శుక్రవారం రజత పతకాన్ని కైవసం చేసుకుంది. హంపీ 17వ, చివరి రౌండ్‌లో ఇటీవలే ప్రపంచ ర్యాపిడ్ టైటిల్‌ను గెలుచుకున్న జోంగీ టాన్‌ను ఓడించడానికి బలమైన ప్రదర్శనను కనబరిచింది. 35 ఏళ్ల హంపీ గురువారం ప్రారంభ తొమ్మిది రౌండ్లలో కేవలం నాలుగు విజయాలు నమోదు చేసిన తర్వాత పట్టికలో 44వ ర్యాంక్‌లో నిలిచింది. అయితే ఈవెంట్ రెండవ రోజున ఎనిమిది రౌండ్లలో ఏడింటిని గెలిచి స్వదేశీ ద్రోణవల్లి హారికతో 14వ రౌండ్ ను డ్రా చేసుకుంది. దింతో టోర్నీలో హంపీ 12.5 పాయింట్లు సాధించింది. హారిక 10.5 పాయింట్లతో 13వ స్థానంలో నిలవగా, పద్మిని రౌత్ 17వ స్థానంలో నిలిచింది. తానియా సచ్‌దేవ్ 21వ స్థానంలో నిలిచింది. ర్యాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య విజేత బి.సవిత శ్రీ 9.5 పాయింట్లతో 33వ స్థానంలో నిలిచింది.

ఓపెన్ కేటగిరీలో ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్ సెన్ టైటిల్ గెలుచుకున్నాడు. ఈ నార్వే ఆటగాడికి 16 పాయింట్లు ఉన్నాయి. టాప్-10లో భారత ఆటగాడు ఎవరూ రాలేకపోయారు. అనుభవజ్ఞుడైన పి. హరికృష్ణ 13 పాయింట్లతో 17వ స్థానంలో నిలిచాడు. నిహాల్ సరిన్ 18వ స్థానంలో నిలిచాడు. టోర్నీలో టాప్ సీడ్ అయిన అర్జున్ ఎరిగే 16, 17, 18 రౌండ్లలో పరాజయం చవిచూశాడు. అతను 42వ స్థానంలో నిలిచాడు. విదిత్ సంతోష్ గుజరాతీ 90వ స్థానంలో నిలిచాడు.