Site icon HashtagU Telugu

Gavaskar Angry:టీమిండియా వ్యూహంపై గవాస్కర్ ఫైర్

Gavaskar Imresizer

Gavaskar Imresizer

అనుకోకుండా వచ్చిన టీమిండియా కెప్టెన్సీని యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్ సద్వినియోగం చేసుకోలేక పోతున్నాడు. ఫీల్డ్‌లో అతడు తీసుకున్న నిర్ణయాల కారణంగా సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో చహల్‌కు పూర్తి కోటా ఓవర్లు ఇవ్వకపోవడం, రెండో మ్యాచ్‌లో కార్తీక్‌ కంటే ముందు అక్షర్‌ పటేల్‌ను పంపించడం వంటి నిర్ణయాలు ప్రతికూల ఫలితాలను ఇచ్చాయి. రెండో టీ20లో పంత్‌ చేసిన తప్పిదంపై మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ తీవ్రంగా మండిపడ్డాడు. కార్తీక్‌పై ఫినిషర్‌ అన్న ముద్ర ఉన్నందుకు అతన్ని చివర్లోనే పంపాలా అని ప్రశ్నించాడు. అతన్ని కాస్త ముందు పంపిస్తే పిచ్‌ పరిస్థితులు తెలుసుకొని మరింత మెరుగ్గా ఆడే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అక్షర్‌ను ముందు పంపాలన్న నిర్ణయం కారణంగా టీమిండియా కేవలం 148 పరుగులకే పరిమితమైంది. అక్షర్‌ 9 రన్స్‌ చేసి ఔటయ్యాడు. చివర్లో వచ్చిన కార్తీక్‌ 21 బాల్స్‌లో 30 రన్స్‌ చేసి తనదైన స్టైల్లో ఇన్నింగ్స్‌ ముగించాడు.

ఫినిషర్‌ అనే ట్యాగ్‌ వల్ల అలాంటి వాళ్లు కేవలం 15వ ఓవర్‌ తర్వాతే రావాలన్నట్లుగా భావించడం సరికాదని గవాస్కర్ చెప్పాడు. అతడు 12 లేదా 13వ ఓవర్లో రాకూడదు అనుకుంటారనీ, ఐపీఎల్‌లోనూ ఇలాగే జరిగిందన్నాడు. చాలా టీమ్స్‌ తమ ప్రధాన బ్యాటర్లను చివరి 4, 5 ఓవర్ల కోసం దాచుకున్నారనీ, వాళ్లను ముందు పంపడం వల్ల తొలి బంతి నుంచే వాళ్లు సిక్స్‌లు కొట్టాల్సిన అవసరం లేదన్నాడు. దీనివల్ల వాళ్లు వికెట్‌ను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతారనీ సన్నీ విశ్లేషించాడు. అందుకు తగినట్లు చివరి ఓవర్లలో ఆడతారని గవాస్కర్‌ వ్యాఖ్యానించాడు. అక్షర్ పటేల్ భారీ షాట్లు ఆడలేక పోవడంతో టీమ్ మేనేజ్ మెంట్ వ్యూహాన్ని అందరూ తప్పు పడుతున్నారు. ఒకవేళ దినేష్ కార్తీక్ ముందు వచ్చి ఉంటే మరో 30 పరుగులు చేసేవాడని చెబుతున్నారు. కాగా డీకే ను చివర్లో పంపలన్న నిర్ణయం పంత్ ఒక్కడిదే కాకపోవచ్చని కొందరు భావిస్తున్నారు.