Team India: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్-2లో భారత జట్టు.. ఆసీస్ తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంటే టాప్ ప్లేస్ లోకి..!

2023 ఆసియా కప్‌లో అద్భుత విజయం సాధించినప్పటికీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు (Team India) నంబర్-1 ర్యాంక్‌ను సాధించలేకపోయింది.

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 09:10 AM IST

Team India: 2023 ఆసియా కప్‌లో అద్భుత విజయం సాధించినప్పటికీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు (Team India) నంబర్-1 ర్యాంక్‌ను సాధించలేకపోయింది. అయితే 2023 వన్డే ప్రపంచకప్‌లోపు టీమిండియా ఈ స్థానానికి చేరుకునే సువర్ణావకాశం ఉంది. సెప్టెంబరు 22 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న 3 వన్డేల సిరీస్‌లో భారత జట్టు రాణించి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంటే నంబర్-1 స్థానానికి చేరుకుంటుంది.

గత 2 వారాల్లో ఐసీసీ వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. తొలి 2 వన్డేల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా జట్టు నంబర్‌-1 ర్యాంక్‌ను సాధించింది. ఆ తర్వాత గత 3 మ్యాచ్‌ల్లో వరుస ఓటములతో ఈ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు 114.889 రేటింగ్ పాయింట్లతో నంబర్-1 స్థానంలో ఉంది.

ఇక ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు రెండో స్థానంలో ఉంది. ప్రస్తుతం టీమ్ ఇండియా రేటింగ్ పాయింట్లు 114.659. ఇప్పుడు ఆస్ట్రేలియాపై క్లీన్ స్వీప్ లేదా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంటే, వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందే భారత జట్టు నంబర్-1 స్థానానికి చేరుకుంటుంది.

Also Read: India ODI Series : టీమిండియా కెప్టెన్‌ గా కెఎల్ రాహుల్.. ఆసీస్‌ తో వన్డే సిరీస్‌ కు భారత జట్టు ఇదే

ఆస్ట్రేలియా కూడా నంబర్-1 స్థానానికి చేరుకునే ఛాన్స్

ప్రస్తుతం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 113 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. భారత్‌తో జరిగే సిరీస్‌లో వన్డే ర్యాంకింగ్స్‌లోనూ నంబర్‌వన్‌ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం ఈ 3 మ్యాచ్‌ల సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లను ఆసీస్ గెలవాలి. ఈ సిరీస్‌లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 22న జరగనుండగా, రెండో, మూడో మ్యాచ్‌లు 24, 27 తేదీల్లో జరగనున్నాయి. ఇది జరిగిన వెంటనే అక్టోబర్ 5 నుంచి భారత్‌లో వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది.