Ryan Ten Doeschate: భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ నవంబర్ 14 నుండి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరగనుంది. రెండు జట్లు తొలి మ్యాచ్ కోసం ఇప్పటికే కోల్‌కతా చేరుకుని తమ సన్నాహాలను మొదలుపెట్టాయి. కోల్‌కతా టెస్ట్‌కు ముందు టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ రయాన్ టెన్ డోషెట్ (Ryan Ten Doeschate) జట్టుకు ఒక హెచ్చరిక జారీ చేశారు. ఈ సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఏ ఆయుధం పట్ల టీమ్ ఇండియా జాగ్రత్తగా ఉండాలో ఆయన సూచించారు.
భారత కోచ్ నుండి టీమ్ ఇండియాకు హెచ్చరిక
దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌కు ముందు రయాన్ టెన్ డోషెట్ మాట్లాడుతూ.. “సాధారణంగా మీరు మొదట ఫాస్ట్ బౌలింగ్ గురించి ఆందోళన చెందుతారు. వారు (దక్షిణాఫ్రికా) ఖచ్చితంగా ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతారని నేను అనుకుంటున్నాను. కానీ మీరు ఉపఖండంలో ఆడుతున్నప్పుడు ఇది (స్పిన్) కూడా ఒక పెద్ద సవాలే. ఒక జట్టుగా మనం ఇందులో మెరుగుపడాలి. మేము దీనిపై ప్రారంభంలోనే దృష్టి పెట్టాం. మేము కొన్ని సందర్భాల్లో వెనుకబడి ఉన్నాము. కాబట్టి ఇది పెద్ద సవాలు” అని ఆయన సూచించారు. భారత కోచ్ తన మాటల్లో దక్షిణాఫ్రికా స్పిన్ విభాగం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచన ప్రాయంగా టీమ్ ఇండియాను హెచ్చరించారు.
న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమిని గుర్తు చేసిన కోచ్
సుమారు ఒక సంవత్సరం క్రితం.. భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయింది. అప్పుడు కివీస్ జట్టు స్పిన్ బౌలింగ్ విభాగం టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్‌లను బాగా ఇబ్బంది పెట్టింది. దీనిపై భారత కోచ్ మాట్లాడుతూ.. “ఆశిస్తున్నాను. మేము న్యూజిలాండ్ సిరీస్ నుండి ఏదైనా నేర్చుకున్నామని. స్పిన్‌ను ఎలా ఆడాలనే దాని కోసం మేము కొన్ని ప్రణాళికలు రూపొందించాము. ఈ రెండు మ్యాచ్‌లలో ఇది చాలా ముఖ్యమైనదిగా మారనుంది. ముఖ్యంగా నాలుగు వారాల క్రితం పాకిస్తాన్‌లో వారు (దక్షిణాఫ్రికా) చేసిన అద్భుతమైన ప్రదర్శనను దృష్టిలో ఉంచుకుంటే” అని పేర్కొన్నారు.
చాలా కాలం తరువాత భారత జట్టు దక్షిణాఫ్రికాపై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేకుండా బరిలోకి దిగడం ఇదే తొలిసారి అవుతుంది. రోహిత్-విరాట్ ఈ ఏడాదే ఐపీఎల్ 2025 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించారు.
