Warm Ups:వార్మప్ మ్యాచ్ లో కుర్రాళ్ళు అదుర్స్

ఐర్లాండ్ టూర్ లో సత్తా చాటిన భారత్ యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్ టూర్ లోనూ అదరగొడుతున్నారు. డెర్బీషైర్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

  • Written By:
  • Publish Date - July 2, 2022 / 12:26 PM IST

ఐర్లాండ్ టూర్ లో సత్తా చాటిన భారత్ యువ ఆటగాళ్లు ఇంగ్లాండ్ టూర్ లోనూ అదరగొడుతున్నారు. డెర్బీషైర్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్ టీమ్ తో టీ ట్వంటీ సీరీస్ కు ముందు అక్కడ పరిస్థుతులకు అలవాటు పడే క్రమంలో బీసీసీఐ కౌంటీ జట్లతో రెండు ప్రాక్టీస్ మ్యాచ్ లు ఏర్పాటు చేసింది. తాజాగా డెర్బిషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్లు మ్యాచ్‌ను వన్ సైడ్ గా మార్చేశారు.
మొదట బ్యాటింగ్ కు దిగిన డెర్బిషైర్ 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల 150 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాటర్లెవరూ భారీ స్కోర్ చేయలేకపోయారు. అంతర్జాతయ అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్న యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆకట్టుకున్నాడు. నాలుగు ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి, రెండు వికెట్లు పడగొట్టాడు. అటు భారత్ కొత్త స్పీడ్ గన్
ఉమ్రాన్ మాలిక్ 31 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్, వెంకటేష్ అయ్యర్ కూడా ఒక్కో వికెట్ తీశారు. తర్వాత టీమిండియా లక్ష్యాన్ని సునాయాసంగా చేదించింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయినప్పటికీ.. టాప్ ఆర్డర్ రాణించింది. మరో ఓపెనర్ సంజు శాంసన్ 30 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లతో 38, దీపక్ హుడా 37 బంతుల్లో రెండు సిక్సర్లు, అయిదు ఫోర్లతో 59 పరుగులు చేశారు. చివర్లో సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లతో 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్ 16.2 ఓవర్లలో టార్గెట్ అందుకుంది. రెండో వార్మప్
మ్యాచ్ లో భారత్ ఆదివారం నార్తాంప్టన్ షైర్ తో తలపడుతుంది.