టీ ట్వంటీ వరల్డ్ కప్ చివరి దశకు చేరింది. రసవత్తరంగా సాగుతున్న ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్ పోరుకు కౌంట్ డౌన్ షురూ అయింది.
సిడ్నీ వేదికగా జరగనున్న తొలి సెమీస్ లో పాకిస్థాన్ , న్యూజిలాండ్ తలపడనున్నాయి. గ్రూప్-1లో అగ్రస్థానంతో న్యూజిలాండ్ సెమీస్‌కు చేరుకోగా.. అదృష్టం కలిసి రావడంతో గ్రూప్-2 నుంచి పాకిస్తాన్ రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్ లో పాక్ కంటే కివీస్ జట్టు మంచి ఫాంలో ఉండగా..పలువురు కీలక ఆటగాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారు. బ్యాటింగ్ లో కేన్ విలియమ్సన్ , గ్లెన్ ఫిలిప్స్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. అటు బౌలింగ్ లో పేసర్లు సమిష్టిగా చెలరేగుతున్నారు. అటు పాక్ జట్టు మాత్రం ఎప్పుడు ఎలా ఆడుతోందో చెప్పలేని పరిస్థితి. సౌతాఫ్రికా ఓటమితో అదృష్టవశాత్తూ సెమీస్ కు చేరింది. చివరి మ్యాచ్ లో బంగ్లా పై తక్కువ స్కోరును కూడా చేదించేందుకు శ్రమించింది. ఇదిలా ఉండగా గత రికార్డులు మాత్రం పాక్ కు అనుకూలంగా ఉన్నాయి.
ఇరు జట్ల మధ్య మొత్తం 28 టీ20 మ్యాచ్‌లు జరగ్గా.. పాక్ 17 మ్యాచ్‌ల్లో, న్యూజిలాండ్ 11 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. టీ20 వరల్డ్‌కప్‌లో ఇరు జట్లు 6 సందర్భాల్లో ఎదురెదురు పడగా.. పాక్ 4 సార్లు, కివీస్ 2 సార్లు విజయం సాధించాయి. గత 5 టీ20ల్లో పాక్ 4 మ్యాచ్‌ల్లో గెలువగా.. న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే నెగ్గింది. మరోవైపు వన్డే, టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌ల్లో పాక్‌కు న్యూజిలాండ్ చేతుల్లో ఓటమన్నదే లేదు. ఈ రెండు జట్లు వన్డే, టీ20 ప్రపంచకప్‌ల్లో మూడుసార్లు సెమీఫైనల్స్‌లో తలపడగా.. అన్నింటిలో పాకిస్థానే గెలిచింది.
1992 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో పాక్.. న్యూజిలాండ్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించగా…, 1999 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో 9 వికెట్ల తేడాతోనూ, 2007 టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో 6 వికెట్ల తేడాతోనూ గెలిచింది. ఈ టీ20ల్లో న్యూజిలాండ్‌పై పాక్ స్పష్టమైన ఆధిపత్యం కలిగి ఉంది.