Site icon HashtagU Telugu

Sheetal Devi: చ‌రిత్ర సృష్టించిన శీతల్ దేవి.. చేతులు లేకపోయినా!!

Sheetal Devi

Sheetal Devi

Sheetal Devi: భారతదేశానికి చెందిన 18 ఏళ్ల పారా ఆర్చర్ శీతల్ దేవి (Sheetal Devi) ప్రపంచ వేదికపై అద్భుతం సృష్టించింది. దక్షిణ కొరియాలోని గ్వాంగ్‌జూలో శనివారం జరిగిన పారా వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్‌లో తుర్కియేకు చెందిన ప్రపంచ నంబర్ 1 ఒజ్నూర్ క్యూర్ గిర్దిని 146-143 తేడాతో ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. శీతల్ ఈ ఛాంపియన్‌షిప్‌లో మూడవ పతకం గెలుచుకోవడం విశేషం. చేతులు లేని ఏకైక ఆర్చర్ అయిన శీతల్.. తన పాదాలు, గడ్డాన్ని ఉపయోగించి బాణాలను సంధించి విజయం సాధించింది.

గిర్దిపై ప్రతీకారం, పర్ఫెక్ట్ ఫైనల్ ఎండ్

ఈ టైటిల్ పోరు 2023 పిల్‌సెన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు పునరావృతం. అక్కడ గిర్ది చేతిలో శీతల్ స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. అయితే ఈసారి శీతల్ అద్భుత ప్రదర్శనతో రెండు సంవత్సరాల క్రితం ఎదురైన ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. వ్యక్తిగత ఫైనల్‌లో శీతల్ స్థిరత్వం కనబరిచింది. కీలకమైన రెండో ఎండ్‌లో మూడు 10లను కొట్టి 30-27తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నాలుగు ఎండ్‌ల తర్వాత రెండు పాయింట్ల ఆధిక్యం కొనసాగించిన శీతల్, చివరి ఎండ్‌లో ఏమాత్రం తడబడకుండా మూడు పర్ఫెక్ట్ బాణాలు (30 పాయింట్లు) కొట్టి స్వర్ణాన్ని ఖాయం చేసుకుంది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఈ ఆర్చర్ సెమీ-ఫైనల్‌లోనూ గ్రేట్ బ్రిటన్‌కు చెందిన జోడీ గ్రిన్‌హామ్‌పై 145-140 తేడాతో సునాయాస విజయాన్ని నమోదు చేసింది.

Also Read: Trump: అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌వ‌ర్త‌న‌పై అమీ బెరా కీల‌క వ్యాఖ్య‌లు.. ఎవ‌రీ బెరా?!

మిక్స్‌డ్ టీమ్ కాంస్యం, ఓపెన్ టీమ్ రజతం

వ్యక్తిగత స్వర్ణంతో పాటు శీతల్ ఈ ఛాంపియన్‌షిప్‌లో మరో రెండు పతకాలు గెలుచుకుంది. తోమన్ కుమార్‌తో కలిసి కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో గ్రేట్ బ్రిటన్‌ను ఓడించి కాంస్యం సాధించింది. కాంపౌండ్ మహిళల ఓపెన్ టీమ్ ఈవెంట్‌లో సరితతో కలిసి ఫైనల్‌లో తుర్కీ చేతిలో 148-152 తేడాతో ఓడి రజతంతో సరిపెట్టుకుంది.

ఓపెన్ టీమ్ ఫైనల్ ఉత్కంఠగా ప్రారంభమైంది. భారత్ మొదటి ఎండ్‌లో ఆధిక్యం సాధించినప్పటికీ ఆ తర్వాత తుర్కిష్ ఆర్చర్లు పుంజుకోవడంతో.. చివరి ఎండ్‌లో భారత ద్వయం తడబడటంతో నాలుగు పాయింట్ల తేడాతో ఓటమి పాలైంది. అయినప్పటికీ శీతల్ దేవి స్వర్ణం, ఆమె పట్టుదల, అసాధారణ ప్రతిభకు నిదర్శనం.

Exit mobile version