Hima Das: భారత స్టార్ స్ప్రింటర్ హిమ దాస్ (Hima Das) గత పన్నెండు నెలల్లో మూడు రెసిడెన్స్ రూల్ ఉల్లంఘించినందుకు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) తాత్కాలికంగా సస్పెండ్ (Suspension)చేసింది. అస్సాంకు చెందిన 23 ఏళ్ల స్ప్రింటర్ హిమ గాయం కారణంగా హాంగ్‌జౌ ఆసియా క్రీడల జట్టులో భాగం కాలేదు. భారత జట్టు అధికారి ఒకరు మాట్లాడుతూ.. “గత ఏడాదిలో ఆమె మూడుసార్లు నివాస నియమాన్ని ఉల్లంఘించింది.” నాడా ఆమెని తాత్కాలికంగా సస్పెండ్ చేయడానికి ఇదే కారణం.” ఆమె రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. దానిని ఏడాదికి తగ్గించవచ్చు అని పేర్కొన్నారు.
2018 జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల్లో హిమ 400 మీటర్ల వ్యక్తిగత ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకుంది. ఆమె స్వర్ణం గెలిచిన 4×400 మీటర్ల మహిళల జట్టు రజతం గెలిచిన మిక్స్‌డ్ రిలే జట్టులో కూడా సభ్యురాలు. వరల్డ్ అథ్లెటిక్స్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ నిబంధనల ప్రకారం.. 12 నెలల వ్యవధిలో మూడు రెసిడెన్స్ రూల్ ఉల్లంఘనలు లేదా పరీక్షలు తప్పినట్లయితే సస్పెన్షన్ విధించబడుతుంది.
హిమ ఎప్పుడు, ఎక్కడ నిబంధనను ఉల్లంఘించిందో తెలియదు. రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (RTP)లో చేర్చబడిన ఆటగాళ్ళు తమ నివాసం, ప్రాక్టీస్ లేదా పని ప్రదేశం పూర్తి చిరునామాను ఇవ్వాలి. ఇది కాకుండా ప్రతి కార్యాచరణ కాల పరిమితిని పేర్కొనాలి. దీనితో పాటు వారు పరీక్ష కోసం 60 నిమిషాల విండోను ఇవ్వాలి. అలా చేయడంలో విఫలమైతే నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. గత కొన్నేళ్లుగా వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్న హిమకు ఈ ఏడాది ఏప్రిల్‌లో చీలమండ గాయమైంది. దీంతో ఆసియా క్రీడల సెలక్షన్స్ టోర్నీ ఫెడరేషన్ కప్‌కు దూరమైంది.