T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 256 పరుగులు చేసింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఏదైనా ఒక జట్టు సాధించిన రెండో అత్యధిక స్కోరు ఇది. అంతేకాకుండా ఈ వరల్డ్ కప్‌లో ఇదే అత్యధిక టోటల్. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అభిషేక్ శర్మ బ్యాట్ ఝుళిపించి 55 పరుగుల శక్తివంతమైన అర్ధసెంచరీ ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ జింబాబ్వే బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు.
2026 టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక స్కోరు
2026 టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు అత్యధిక స్కోరు 254 పరుగులుగా ఉండేది. దీనిని జింబాబ్వేపై వెస్టిండీస్ సాధించింది. అయితే ఇప్పుడు అదే జింబాబ్వేపై టీమ్ ఇండియా 256 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక స్కోరు రికార్డు శ్రీలంక పేరిట ఉంది. 2007 వరల్డ్ కప్‌లో కెన్యాపై శ్రీలంక 260 పరుగులు చేసింది. భారత్ ఆ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి కేవలం 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
Also Read: వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా సూపర్ విక్టరీ.. భారత్‌కు ఊరట!
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక స్కోర్లు
- 260 పరుగులు – శ్రీలంక (కెన్యాపై)
- 256 పరుగులు – భారత్ (జింబాబ్వేపై)
- 254 పరుగులు – వెస్టిండీస్ (జింబాబ్వేపై)
- 235 పరుగులు – ఐర్లాండ్ (ఒమన్‌పై)
మెరిసిన అభిషేక్ శర్మ
ఈ వరల్డ్ కప్‌లో మొదటి మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ అభిషేక్ శర్మ ‘సున్నా’ (డకౌట్)కే వెనుదిరిగారు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో కూడా కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. చివరకు జింబాబ్వేపై బ్యాట్ గర్జించింది. 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఇది అభిషేక్ టీ20 కెరీర్‌లో రెండో అత్యంత నెమ్మదైన ఫిఫ్టీ. మొత్తం మీద శర్మ 30 బంతుల్లో 55 పరుగులు చేశాడు.
హార్దిక్-తిలక్ విధ్వంసం
అభిషేక్ తర్వాత హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ కేవలం 31 బంతుల్లోనే 84 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హార్దిక్ 23 బంతుల్లో 50 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. మరోవైపు తిలక్ వర్మ విస్ఫోటక శైలిలో బ్యాటింగ్ చేశాడు. తిలక్ కేవలం 16 బంతుల్లోనే 44 పరుగులు సాధించారు. హార్దిక్, తిలక్ కలిసి మొత్తంగా 8 సిక్సర్లు, 5 ఫోర్లు బాదారు.
