Site icon HashtagU Telugu

India vs Pakistan : అహ్మదాబాద్‌ వేదికగా హై – వోల్టేజ్ ఫైట్‌.. పాక్‌ పై భారత్ ఆధిపత్యం కొనసాగేనా?

High Voltage Fight In Ahmedabad. Will India Continue To Dominate Pakistan!

High Voltage Fight In Ahmedabad. Will India Continue To Dominate Pakistan!

India vs Pakistan World Cup 2023 : వన్డే వరల్డ్‌కప్‌లో హై – వోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో అహ్మదాబాద్ వేదికగా ఈ మహాసమరం జరగనుంది. వరుస విజయాలతో దూకుడు మీదన్న పాక్‌, భారత్‌ (India).. రేపటి మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్​ కోసం కోట్లాది మంది క్రికెట్ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే భారత తుది జట్టుపైనే ఆసక్తి నెలకొంది. డెంగ్యూ బారిన పడిన శుభ్‌మన్ గిల్ పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రాక్టిస్‌ మొదలుపెట్టిన గిల్‌..తనకు అచ్చొచ్చిన అహ్మదాబాద్ వేదికగానే రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఒకవేళ గిల్ రీఎంట్రీ ఇస్తే ఇషాన్ కిషన్‌ బెంచ్‌కు పరిమితం కానున్నాడు. ఇక అఫ్గాన్‌తో శ్రేయస్ అయ్యర్ రాణించిన నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక బౌలింగ్ కాంబినేషన్‌లోనూ స్వల్ప మార్పులు జరగనున్నాయి. పిచ్ కండిషన్స్ స్పిన్‌కు అనుకూలంగా ఉంటే టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది. అప్పుడు శార్దూల్ ఠాకూర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వస్తాడు. ఒకవేళ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే మాత్రం అశ్విన్ బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. శార్దూల్‌ ఠాకూర్‌ స్థానంలో మహ్మద్‌ షమీను జట్టులోకి తీసుకునే ఛాన్స్‌ ఉంది. మహ్మద్‌ షమికి అహ్మదాబాద్‌ పిచ్‌పై మంచి రికార్డ్‌ ఉండడం కలిసొచ్చే అంశం. ఇక మిగతా కాంబినేషన్‌లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు.

మరోవైపు భారత్‌ (India)తో మ్యాచ్ అనగానే పాకిస్తాన్‌ కూడా గట్టిపోటీనిచ్చేందుకు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. దీనికి తోడు ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్ జట్టు నిలకడగా ఆడుతోంది. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పైనా, రెండో మ్యాచ్‌లో శ్రీలంకపైనా ఘనవిజయాలు అందుకుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో లంకపై పీకల్లోతు కష్టాల్లో నుంచి బయటపడి భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసి పాక్‌ను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. బాబర్ అజాం, మహ్మద్ రిజ్వాన్, షకీల్ ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిది, హసన్ అలీతో పాటు హ్యారిస్ రవూఫ్‌ కీలకం కానున్నారు. ఇదిలా ఉంటే వన్డే ప్రపంచకలో పాకిస్థాన్‌పై భారత్ పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ వస్తోంది. వన్డే ప్రపంచకప్​ టోర్నీల్లో భారత్ – పాక్ (India – Pakistan) ఏడుసార్లు తలపడ్డాయి. ఈ ఏడుసార్లు భారత్‌దే పైచేయిగా నిలిచింది. ఇక చివరిసారిగా రెండు జట్లు 2023 ఆసియా కప్​లో తలపడ్డాయి.

ఈ మ్యాచ్​లో పాకిస్థాన్​ను, భారత్ 228 పరుగుల భారీ ఆధిక్యంతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ ద్వారా భారత జట్టు వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై వరుసగా ఎనిమిదో విజయం సాధించి రికార్డును మరింత పెంచాలని పట్టుదలతో ఉంది. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులు హాజరు కానున్నారు. పలువురు సెలబ్రిటీలు కూడా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వస్తున్నారు.

Also Read:  India- Pakistan: భారత్- పాకిస్తాన్ మధ్య మొదటి క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగిందంటే..?