Site icon HashtagU Telugu

IPL 2024: SRH కెప్టెన్ హెన్రీచ్ క్లాసెన్?

IPL 2024

New Web Story Copy (58)

IPL 2024: ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఫ్యాన్ బేస్ ఎక్కువే. ఒకప్పుడు స్టార్ ఆటగాళ్లతో నిండి ఉండే ఈ జట్టు ప్రస్తుతం క్యాలిఫైయర్ మ్యాచ్ లకు కూడా అర్హత సాధించట్లేదు. గత సీజన్లో అయితే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. అయినప్పటికీ ఆ జట్టుపై అభిమానులు అంతులేని ప్రేమ చూపిస్తుంటారు. తెలుగు జట్టు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సన్ రైజర్స్ కు మద్దతుగా నిలుస్తూ ఉంటారు. 2024 ఐపీఎల్ టైటిల్ లక్ష్యంగా సన్ రైజర్స్ యాజమాన్యం జట్టులో ప్రక్షాళన చేయనుంది. ఇప్పటికే హెడ్ కోచ్ పై సెహ్వాగ్ పేరు వినిపించగా, వచ్చే ఐపీఎల్ నాటికి జట్టు కెప్టెన్ ని కూడా మార్చాలని భావిస్తున్నారు.

అమెరికా క్రికెట్ లీగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆటగాడు హెన్రీచ్ క్లాసెన్ కిర్రాక్ ఇన్నింగ్స్ ఆడాడు. ధనాధన్ బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. క్లాసెన్ సూపర్ సెంచరీతో ఎంఐ న్యూయార్క్‌ బౌలర్లను ఉతికారేశాడు. క్లాసెన్‌ విధ్వంసం ముందు రషీద్‌ ఖాన్‌ నిలువలేకపోయాడు. రషీద్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో ఉతికారేశాడు. 44 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 110 పరుగులు చేసి సీటెల్ ఓర్కాస్‌ జట్టుని గెలిపించాడు. ఎంఐ న్యూయార్క్‌ నిర్ణీత 20 ఓవర్లలో 194 పరుగులు చేయగా.. సీటెల్ ఓర్కాస్‌ 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.

క్లాసెన్‌ విధ్వంసంపై సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇలాంటి విధ్వంసకరుడు ఎస్ఆర్హెచ్ జట్టుకు కెప్టెన్ అయితే జట్టు భవిష్యత్తు పూర్తిగా మార్చేస్తాడని అభిప్రాయపడుతున్నారు క్రికెట్ అనలిస్టులు. సో మొత్తానికి 2024 ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ పై ఇప్పటినుంచే చర్చ మొదలైంది. గత సీజన్లో సన్ రైజర్స్ తరుపున హెన్రీచ్ క్లాసెన్ ఒక్కడే పోరాడాడు. తనపై పెట్టుకున్న నమ్మకానికి పూర్తిగా న్యాయం చేసాడు.

Also Read: 2857 Cars Burnt : 3000 కార్లు దగ్ధం.. నౌకలో అగ్నిప్రమాదం